మాస్కో- ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు

మాస్కో- ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు

రష్యా రాజధాని మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్  కలకలం సృష్టించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన బాండ్ స్వ్కాడ్ సిబ్బంది ఎయిర్ పోర్టులో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫ్లైట్ లాండ్ అయ్యాక విమానాన్ని క్షుణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో  ఎలాంటి బాంబు, పేలుడు పదార్థాలు దొరకపోవడంతో..అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బెదిరింపు
గురువారం రాత్రి రష్యా రాజధాని మాస్కో నుండి ఢిల్లీకి  ఎస్‌యూ 232  నెంబర్ విమానం బయలుదేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దుండగులు ...విమానంలో బాంబు ఉందంటూ 11 :15 నిమిషాలకు ఈమెయిల్ పంపారు.  ఈ బాంబు బెదిరింపుతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున  3:20 గంటలకు విమానం .. ఢిల్లీ విమానాశ్రయంలో  ల్యాండ్ అయింది. బెదిరింపుల నేపథ్యంలో అంతకుముందే ఎయిర్‌పోర్టులో భద్రతను పెంచారు. ఫ్లైట్ ల్యాండ్ కాగానే అందులోని 386 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి..తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు, ఇతర పేలుడు వస్తువులు  కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు
వారం క్రితం ఇరాన్ ఫ్లైట్ కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్ జౌ వెళ్తున్న విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో దుండగులు విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరించారు. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన రెండు ఫైటర్ జెట్లు..ఆ ఫ్లైట్ ను అనుసరించాయి. బెదిరింపుల నేపథ్యంలో  విమానాన్ని  జైపుర్‌ లేదా చండీగఢ్‌లో ల్యాండ్ చేయాలని ఫైలెట్లకు సూచించారు. కానీ... అందుకు వారు నిరాకరించారు. దీంతో ఆ విమానం భారత భూభాగం నుంచి చైనాలో అడుగుపెట్టింది.  ఆ తర్వాత విమానానికి ఏమీ కాలేదు..దీంతో  బాంబు బెదిరింపు ఫేక్ అని తేలిపోయింది.