అనర్హుల పేర్లు ఉన్నాయంటూ అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు
మూడు గంటలపాటు ఖానాపూర్‌లో హైడ్రామా
ఖానాపూర్, వెలుగు : నిర్మల్‌జిల్లా ఖానాపూర్ పట్టణంలో గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లక్కీ డ్రా సందర్భంగా గందరగోళం నెలకొంది. అడిషనల్ కలెక్టర్ రాంబాబు సమక్షంలో పట్టణంలోని 12 వార్డుల నుంచి 420 మందిని ఇళ్ల కోసం ఎంపిక చేశారు. అయితే చాలామంది పేదలకు ఇల్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇల్లు ఉన్నవారికి కూడా కేటాయించారని మహిళలు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు రాజురా సత్యం, దయానంద్, కిషోర్ నాయక్, షబ్బీర్ పాషా, అమానుల్లా ఖాన్, నాయిని సంతోష్, సీపీఐ(ఎంఎల్), ప్రజా పంథా పార్టీల నాయకుడు నంది రామయ్య ఆధ్వర్యంలో పేదలు లక్కీ డ్రా హాల్ వద్ద బైఠాయించారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి, అధికార పార్టీకి చెందిన నేతల సిఫారసు ఉన్నవారికి ఇల్లు కేటాయించారంటూ ఆరోపించారు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ నినాదాలు చేశారు.
అక్కడినుంచి నేరుగా పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్దకు చేరుకొని బైఠాయించారు. దాదాపు రెండు గంటలకుపైగా ప్రభుత్వానికి, సర్వే చేసిన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మహిళలకు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. లక్కీ డ్రా సెంటర్ కు వచ్చిన ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం సక్రమంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక వ్యవహారంలో అధికారుల తప్పిదం వల్ల పొరపాట్లు జరిగి ఉండవచ్చని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అక్రమాలను నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శుక్రవారం ఖానాపూర్ పట్టణం బంద్ కు పిలుపునిచ్చాయి.
