నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో గందరగోళం..సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆరోపణ

నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో గందరగోళం..సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆరోపణ
  • డీఎంఈ కార్యాలయం ముందు నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన  

హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగ్‌‌లు ఇవ్వడంతో గందరగోళం నెలకొన్నది. బుధవారం జరిగిన ప్రమోషన్ ప్రక్రియలో జూనియర్లకు ప్రాధాన్యత ఇచ్చి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లను పక్కనబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు డీఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రమోషన్లు, పోస్టింగ్‌‌లో పారదర్శకత పాటించాలని పలుమార్లు అధికారులను ఆదేశించినప్పటికీ, కొందరు కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తున్నది.

 ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సీనియారిటీ ఆధారంగా ఆప్షన్ల ఎంపిక జరగాల్సి ఉండగా, ఒక సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌‌ను రెండో ప్రాధాన్యతగా పరిగణించి, ఆమె కంటే జూనియర్‌‌కు మొదటి పోస్టింగ్ కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఈఏడాది డిసెంబర్‌‌లో రిటైర్ కావాల్సి ఉండగా, వచ్చే ఏడాది జనవరిలో రిటైర్ కావాల్సిన జూనియర్‌‌కు మొదట పోస్టింగ్ ఇచ్చి, డీఎంఈ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బాధితులు ఆరోగ్య మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

11 మంది నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు

రాష్ట్రవ్యాప్తంగా 11 గ్రేడ్-1 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం డీఎంఈ కార్యాలయంలో అర్హుల ఎంపిక, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ప్రమోషన్లు, పోస్టింగ్‌‌లు కేటాయించారు. అయితే, పోస్టింగ్‌‌ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు ఆరోపిస్తున్నారు.

 సీనియారిటీ ప్రకారం ఆస్పత్రులను ఎంపిక చేసుకునే అవకాశం తమకు కల్పించలేదని, దీంతో తాము కోరుకున్న హాస్పిటల్​లో పనిచేసే అవకాశాన్ని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్‌‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, కొందరు అధికారులు అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకోవడంతో సీనియర్లకు అన్యాయం జరుగుతున్నదని నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.