గోషామహల్ నాలా నిర్మాణంలో అవినీతి జరిగింది : రాజాసింగ్

గోషామహల్ నాలా నిర్మాణంలో అవినీతి జరిగింది : రాజాసింగ్

గోషామహల్లోని చాక్నవాడి నాలా నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. చాక్నవాడిలో కుంగిపోయిన పెద్ద నాలాను ఆయన పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2009లో నాలాపై స్లాబ్ వేశారని.. నాసిరకంగా నిర్మాణం చేపట్టారని అన్నారు. కుంగిన నాలాతో నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1980లో కూడా నాలా పడిపోయిందని.. అప్పుడు ఎవరు గాయపడలేదని చెప్పారు. తాజాగా జరిగిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు.

గోషామహల్లోని చాక్నవాడిలో రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందులో పడిపోయాయి. ప్రతి శుక్రవారం బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేస్తారు. దీంతో కూరగాయలు ఇతర వస్తువులు కొనేందుకు చాలా మంది జనం అక్కడకు వచ్చారు. అదే సమయంలో నాలా కుంగడంతో కూరగాయల దుకాణాలతో పాటు జనం అందులో పడిపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

40 ఏండ్ల క్రితం నాలాపై రోడ్డు వేశారని,  ట్రాన్స్ పోర్ట్, టింబర్ డిపోల నుంచి లారీలు ఓవర్ లోడ్ తో తిరుగుతుండటమే రోడ్డు కుంగిపోవడానికి కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మార్కెట్ జరిగే రోజు కావడంతో సాయంత్రం సమయంలో నాలా కుంగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రమాదానికి సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.