రాజన్న సిరిసిల్ల, వెలుగు: సెస్‌ను కాపాడుకుంటామని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర ఉద్యమం చేపడతామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు హెచ్చరించారు. సెస్‌ను కాపాడుకోవడం కోసం వినియోగదారులంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన సెస్ 52వ మహాజన సభలో సెస్ పాలకవర్గం ఐదు తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ, 1970లో కేవలం 4 వేల మంది వినియోగదారులతో ప్రారంభమైన సెస్ ప్రస్తుతం 3 లక్షల మంది సభ్యులను కలిగి ఉందన్నారు.
గత 56 ఏళ్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నదని తెలిపారు. రైతులు, నేతలకు సబ్సిడీతో విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. సెస్‌పై ఇష్టారీతిగా అభాండాలు వేస్తూ సంస్థను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. సెస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని అభిప్రాయపడ్డారు. ఎన్పీడీసీఎల్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే సెస్ లైసెన్స్ రెన్యూవల్ కోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో 15 మంది సెస్ డైరెక్టర్లు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.
