సోదాల పేరుతో హద్దులు దాటుతున్నరు.. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సోదాల పేరుతో హద్దులు దాటుతున్నరు.. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తున్నారు
  • తమిళనాడు ప్రభుత్వ మద్యం రిటైలర్​ టాస్మాక్‌‌  మనీలాండరింగ్‌‌ దర్యాప్తుపై స్టే
  • ఈడీకి వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించిన తమిళనాడు
  • పిటిషన్​పై సమాధానం ఇవ్వాలని ఈడీకి కోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ)పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాల పేరుతో అన్ని హద్దులు దాటుతున్నదని మండిపడింది. సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నది.  తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ రిటైలర్ టాస్మాక్ పై  సోదాల విషయంలో ఈడీ తీరును కోర్టు తప్పుపట్టింది.

ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌‌ లిమిటెడ్​(టాస్మాక్​)లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై సీజేఐ బీఆర్​గవాయ్, జస్టిస్​ ఆగస్టీన్​ జార్జ్​ మాసిహ్​​నేతృత్వంలోని బెంచ్​ గురువారం విచారణ చేపట్టింది. తమిళనాడు సర్కారు తరఫున సీనియర్​ లాయర్​ కపిల్  సిబల్​ వాదనలు వినిపించారు.

ఈ ఏడాది మార్చి 14, మే 16న టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో ఈడీ సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నదని చెప్పారు. ఈ సందర్భంగా సీజేఐ గవాయ్​ బెంచ్​ స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్‌‌కు దీనికి సంబంధం ఏమిటి? అని ఈడీ తరఫున హాజరైన అడిషనల్​ సొలిసిటర్​ జనరల్​ ఎస్వీ రాజును ప్రశ్నించింది. టాస్మాక్‌‌ పై జరుగుతున్న మనీలాండరింగ్‌‌ దర్యాప్తుపై స్టే విధించింది.

రూ. వెయ్యి కోట్ల అవకతవకలు జరిగాయన్న ఈడీ

టాస్మాక్​లో రూ. వెయ్యి కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి, మేలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. అధికారుల ఇండ్లలోనూ తనిఖీలు చేపట్టింది. ఈ అవకతవకలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

దీనిపై తమిళనాడు ప్రభుత్వం మద్రాస్​ హైకోర్టుకు వెళ్లింది. ఈడీ అధికారులు వేధిస్తున్నారని పిటిషన్​లో పేర్కొంది. అయితే, ఆ పిటిషన్​ ను హైకోర్టు కోట్టివేయగా.. తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సీజేఐ గవాయ్​ నేతృత్వంలోని బెంచ్.. ఈడీ తీరుపై మండిపడింది. దర్యాప్తుపై స్టే విధించగా.. ఈడీ తరఫున లాయర్​ రాజు దీన్ని వ్యతిరేకించారు.  

ఈ అంశంలో రూ. వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగిందని, ఈడీ  ఈ కేసులో ఎక్కడా హద్దులు దాటలేదని అన్నారు.  సిబల్​ వాదిస్తూ.. మద్యం దుకాణాల లైసెన్సుల మంజూరులో జరిగిన అక్రమాలపై రాష్ట్రం ఇప్పటికే క్రిమినల్​ చర్యలు తీసుకున్నదని తెలిపారు. 2014–21  వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్​లు నమోదు చేసిందని చెప్పారు. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి టాస్మాక్​పై దాడులు చేస్తున్నదని తెలిపారు.  దీనిపై సీజేఐ గవాయ్​ బెంచ్​ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్​పై మీరెలా దాడులు చేస్తారు? అని ఈడీని ప్రశ్నించింది. ఈ పిటిషన్​పై సమాధానం ఇవ్వాలని ఎన్​ఫోర్స్ మెంట్​​ డైరెక్టరేట్​కు నోటీసులు జారీచేసింది. ​  

డీఎంకే హర్షం

సుప్రీంకోర్టు ఉత్తర్వులపై అధికార డీఎంకే హర్షం వ్యక్తం చేసింది.  తమిళనాడు సర్కారు ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు ఇది చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నది. ఆ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వ్యాఖ్యానించింది. బీజేపీయేతర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని డీఎంకే కార్యదర్శి ఆర్‌‌ఎస్‌‌ భారతి ఆరోపించారు.

‘వక్ఫ్‌‌’ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వాయిదా

వక్ఫ్​సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్‌‌ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై విచారణ తర్వాత .. వక్ఫ్‌‌ బై యూజర్‌‌ లేదా వక్ఫ్‌‌ డీడ్‌‌ ద్వారా వక్ఫ్‌‌ భూములుగా ప్రకటించిన ఆస్తులను డీనోటిపై చేసే అధికారం‌‌, వక్ఫ్‌‌ కౌన్సిల్‌‌లో.. స్టేట్‌‌ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే ఉండాలన్న వాదన, వక్ఫ్‌‌ కింద ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించడం వంటి మూడు కీలక అంశాలపై సుప్రీం కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్‌‌ చేసింది. ఈ పిటిషన్లపై మూడ్రోజులుగా అన్నివైపుల నుంచి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ బీఆర్‌‌‌‌ గవాయ్‌‌, జస్టిస్‌‌ మీసీహ్‌‌ నేతృత్వంలోని బెంచ్‌‌ గురువారంతో విచారణ ముగించింది.