మమ్ములను  ఓట్ల కోసం వాడుకుంటున్నరు ..వడ్డెర సంక్షేమ సంఘం ఆవేదన

మమ్ములను  ఓట్ల కోసం వాడుకుంటున్నరు ..వడ్డెర సంక్షేమ సంఘం ఆవేదన
  •     తమను రాజులు అంటూ మాటలకే పరిమితం చేస్తున్నరు

పంజాగుట్ట, వెలుగు: వడ్డెరలను బీసీ–ఏ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని, రాజకీయ పక్షాలు తమ సామాజిక వర్గానికి తగినన్ని సీట్లు కేటాయించాలని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు మైసయ్య కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు తమను ‘వడ్డె రాజులు’ అని పిలుస్తూ కేవలం మాటలకే పరిమితం చేశాయన్నారు. రాజకీయ పక్షాలు తమను కేవలం ఓటు బ్యాంకులా వాడుకుని వదిలేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వడ్డెరలు ఎస్సీలుగా, మరికొన్ని చోట్ల ఎస్టీలుగా గుర్తింపు పొందారని, అదే విధంగా తెలంగాణలో కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఎస్టీలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 35 లక్షల మంది వడ్డెర జనాభా ఉన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని, జనాభా దమాషా ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.  నేతలు డాక్టర్ శ్రీనివాస్, ఎం. శేఖర్, బి. హనుమంతు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.