ములుగు/ ఏటూరునాగారం/ జనగామ అర్బన్, వెలుగు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్లు దివాకర, సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ దివాకర వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ 72.47శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తిచేయాలంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలన్నారు. అనంతరం ఏటూరునాగారం ఏటీడీఏలో వివిధ బ్యాంకు ఆఫీసర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. వివిధ పథకాలకు మంజూరైన రుణాల పురోగతిపై ఆరా తీశారు.
జనగామ కలెక్టరేట్లో తహసీల్దార్లకు, నియోజకవర్గ స్థాయి ట్రైనర్లకు సర్ ప్రక్రియపై నిర్వహించిన ఒకరోజు శిక్షణలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి వెరిఫికేషన్ ద్వారా కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ తదితర పనులు క్షేత్రస్థాయిలో చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆయన జనగామ మైనార్టీ గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాఫ్, కిచెన్ రూములను పరిశీలించారు. టెన్త్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ స్వయంగా విద్యాబోధన చేశారు. ఆ తర్వాత శామీర్పేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.
