
‘‘పవన్ కళ్యాణ్ గారు సెట్‌లో ఎక్కువగా పుస్తకాలు, సాహిత్యం, చరిత్ర గురించి మాట్లాడేవారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల చర్చ జరిగినా ఎక్కువగా ఆయన జనం గురించే మాట్లాడతారు..” అని చెప్పింది ప్రియాంక అరుళ్ మోహన్. ‘ఓజీ’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జంటగా నటించిన ఆమె.. ఈనెల 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమా విశేషాల గురించి ఇలా ముచ్చటించింది.
‘‘దాదాపు రెండున్నరేళ్లుగా ‘ఓజీ’ సినిమాతో ట్రావెల్ అవుతున్నా. పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం రావడం అదృష్టం. ఈ జర్నీని జీవితంలో మర్చిపోలేను. ఇందులో కణ్మని అనే పాత్రలో కనిపిస్తా.
ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రల్లో నాకెంతో ఇష్టమైన పాత్ర ఇది. ఎయిటీస్‌లో జరిగే కథ. అందుకు తగ్గట్టుగా నా పాత్రను మలిచిన తీరు, పాత్రలోని ఆహార్యం ఆకట్టుకుంటాయి. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉన్న ఇన్నోసెంట్ అమ్మాయిగా కనిపిస్తా. అతని జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర నాది. యాక్షన్ సినిమా అయినప్పటికీ ఇందులో అది ఒక భాగం మాత్రమే. బలమైన కథతో పాటు చక్కని ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఇక నేను బెంగళూరులో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి తెలుసు. నేను ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ ఉందని ఆయనతో కలిసి నటించేటప్పుడు తెలిసింది. అయినప్పటికీ ఎప్పుడూ ఒదిగే ఉంటారు.. డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా సింపుల్ గా ఉంటారు. అందరినీ సమానంగా చూస్తారు.
ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లో పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో. సెట్‌లో సినిమాకి ఉపయోగపడే గొప్ప సూచనలు ఇస్తుంటారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నా. ఇక ఇందులో నా లుక్, క్యారెక్టర్ బాగున్నాయంటే ఆ క్రెడిట్ దర్శకుడు సుజీత్‌దే. డీవీవీ బ్యానర్‌లో ఇది నా రెండో సినిమా కావడంతో నా హోమ్ బ్యానర్‌లా ఫీలవుతాను. నిజానికి నేను మొదట కమిట్ అయిన సినిమా ‘ఓజీ’. కానీ ‘సరిపోదా శనివారం’ ముందుగా విడుదలైంది. తెలుగులో కొన్ని కథలు వింటున్నా.. ఇతర భాషల్లోనూ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నా’’.