కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో యూపీలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్, ప్రియాంకలు చేసిన విమర్శలపై యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాటలను వింటే ఇండియా కూడా ఇటలీ అవుతుందని అన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని కాంగ్రెస్ పాలించిందని… అయినప్పటికీ ఒక అజెండాను కానీ, ప్రజల కోసం ఒక విజన్ ను కానీ రూపొందించడంలో తీవ్రంగా విఫలమైందని యోగి విమర్శించారు. కరోనా తొలి కేసు బయటపడే సమయానికి దేశంలో ఒకే ఒక కరోనా ల్యాబ్ అందుబాటులో ఉందన్నారు. ఇప్పుడు 650 ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని, రోజుకు 2 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా విమర్శలు చేయడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని అన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.


