గోడకు కన్నం వేసి గుడిలో చోరీ.. అమ్మవారి 18 తులాల బంగారం, 2 కిలోల వెండి అపహరణ

గోడకు కన్నం వేసి గుడిలో చోరీ.. అమ్మవారి 18 తులాల బంగారం, 2 కిలోల వెండి అపహరణ

మల్కాజిగిరి పరిధిలో ఘటన
కౌంటర్​లోని 70 వేల క్యాష్ ఎత్తుకెళ్లిన దొంగలు


సికింద్రాబాద్, వెలుగు: ఆలయం వెనుక భాగంలో గోడకు కన్నం వేసి లోపలికి వచ్చిన దొంగలు అమ్మవారి నగలు, కౌంటర్​లోని డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్​నగర్ రైల్వే గేట్ సమీపంలో దుర్గా భవానీ ఆలయం ఉంది. పూజారులు, సిబ్బంది శుక్రవారం సాయంత్రం గుడికి తాళాలు వేసి వెళ్లిపోయారు.

 అర్ధరాత్రి ఆలయ వెనుక భాగంలో ఉన్న గోడకు రంధ్రం చేసి లోపలికి వచ్చిన దొంగలు అమ్మవారి విగ్రహానికి అలంకరించిన 18 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి, కౌంటర్​లో ఉన్న రూ.70 వేల క్యాష్​ను తీసుకున్నారు. ఆ తర్వాత భక్తుల కోసం ఏర్పాటు చేసిన రెండు హుండీలు, అన్నదానం విరాళాల కోసం ఏర్పాటు చేసిన మరో రెండు హుండీలను దొంగలు పగులగొట్టారు. అందులోని డబ్బును తీసుకుని, ఆ తర్వాత సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్​ను కూడా ఎత్తుకెళ్లారు. 

శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు.. వెనుక వైపు ఉన్న గోడకు రంధ్రాన్ని గుర్తించారు. గర్భగుడిలోకి వెళ్లి చూడగా.. అమ్మవారి నగలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి మల్కాజిగిరి పీఎస్​లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.