థర్డ్ డిస్కం ఏర్పాటుకు అనేక సవాళ్లు!

థర్డ్ డిస్కం ఏర్పాటుకు అనేక సవాళ్లు!
  • అప్పులు, కనెక్షన్లు, ఉద్యోగుల బదిలీలు తప్పనిసరి
  • ఉచిత ​కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకే
  • 5.22 లక్షల డీటీఆర్లపై మీటర్ల ఏర్పాటుకు కసరత్తు 
  • అప్పుల కుప్పగా మారే డిస్కంలోకి వెళ్లేందుకు ఉద్యోగుల అనాసక్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలో థర్డ్ డిస్కం ఏర్పాటుకు సంబంధించి ఉన్నతాధికారులకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంతకాలం రెండు డిస్కంల పరిధిలో ఉన్న ఉచిత వ్యవసాయ కనెక్షన్లతో పాటు, లిఫ్ట్​ స్కీములు, మిషన్​ భగీరథ, ఇతర డ్రింకింగ్ వాటర్​ కనెక్షన్లన్నింటినీ మూడో డిస్కంలోకి బదలాయించడం అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ విడదీసి ప్రత్యేక డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏర్పాటుచేసే వీలులేనందున డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్​ఫార్మర్లపై మీటర్లు పెట్టాలని నిర్ణయించారు.

వీటి పర్యవేక్షణ, మీటర్​ రీడింగ్​కు ప్రస్తుతం కేటాయిస్తున్న సిబ్బంది సరిపోరని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు డిస్కంలపై ఉన్న అప్పులన్నీ కొత్త డిస్కంకు బదలాయించనున్నారు. దీంతో అప్పులకుప్పగా మారబోయే థర్డ్​ డిస్కంలోకి వచ్చేందుకు సిబ్బంది మొగ్గుచూపడం లేదు. 

41,239 కోట్ల బకాయిల భారం 

రాష్ట్రంలో నార్త్, సౌత్ డిస్కంలు రెండు పనిచేస్తున్నాయి. గడిచిన పదేండ్లలో ఈ డిస్కంలు రూ.59 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. సౌత్ డిస్కం(టీజీ ఎస్​పీడీసీఎల్)​ రూ.41 వేల కోట్లు, నార్త్ డిస్కం​(టీజీ ఎన్​పీ డీసీఎల్) రూ.18 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభమైనప్పటి నుంచే డిస్కంలకు నష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014  నవంబరు నుంచి వ్యవసాయానికి 9 గంటల కరెంట్ సరఫరా ప్రారంభించారు. ఆ తర్వాత 2017 నవంబర్​ నుంచి దీనిని 24 గంటలకు పెంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు 29 లక్షల 5 వేల 779 ఉన్నాయి. 

వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 489 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌ (ఎల్​ఐఎస్​) కనెక్షన్లు, 99 హైదరాబాద్ జలమండలి, 1,132 మిషన్  భగీరథ, 639 మున్సిపాలిటీల పరిధిలోని ప్రత్యేక డీటీఆర్​ల నీటి కనెక్షన్లున్నాయి. వీటన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేసే మూడో డిస్కంకు బదిలీ చేయనున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడే డిస్కంపై ఏకంగా రూ. 41,239 కోట్ల భారం పడనుంది. ఇందులో రూ.22,926 కోట్ల లిఫ్ట్​ ఇరిగేషన్​ బకాయిలు, రూ.7,084 కోట్ల హైదరాబాద్​ జలమండలి బకాయిలు, రూ.5,972 కోట్ల మిషన్​ భగీరథ బకాయిలున్నాయి. ఈ అప్పులన్నీ మూడో డిస్కం మోయాల్సి ఉంటుంది. 

5.22 లక్షల డీటీఆర్​ లపై మీటర్లు 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ నుంచి చివరి వినియోగ స్థానం వరకు ఉన్న డౌన్‌‌‌‌ స్ట్రీమ్ లైన్లు, డీటీఆర్​లను మూడో డిస్కంకు బదిలీ చేయనున్నారు. ఇందులో 5,22,479 వ్యవసాయ విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా కొలిచేందుకు.. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల (డీటీఆర్​లు)పై స్మార్ట్​ మీటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఒక్కో స్మార్ట్​ మీటర్​ ఏర్పాటుకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.1,306 కోట్లు ఖర్చుచేయనున్నారు. అలాగే, 2 లక్షల 61 వేల 240 కిలోమీటర్ల పొడువు గల ఎల్​టీ వ్యవసాయ విద్యుత్​ లైన్లను థర్డ్​ డిస్కమ్​లోకి బదిలీ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ విద్యుత్​ సబ్​ స్టేషన్లన్నీ కూడా పాత డిస్కంల పరిధిలో ఉన్నాయి. సబ్​ స్టేషన్ల నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ సప్లయ్​ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీటీఆర్​లపై మీటర్లు పెడితే కచ్చితమైన విద్యుత్​ లెక్కలు రావని నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. 

ప్రైవేటీకరణ భయం

మూడో డిస్కం ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కోసం టీజీ ట్రాన్స్​కో, టీజీ జెన్​కో, ఉత్తర, దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థల నుంచి ఉద్యోగులను బదిలీ చేయాలనే ఆదేశాలు వచ్చాయి. ఏప్రిల్​ 1 లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. టీజీ జెన్​కో, ట్రాన్స్​కో, ఎన్​పీడీసీఎల్, ఎస్​పీడీసీఎల్ నుంచి 660 ఇంజినీర్లు, వెయ్యి మంది సిబ్బంది, 340 మంది పరిపాలనా ఉద్యోగులను నియమించాలని అనుకుంటున్నారు. 

కానీ, ఏర్పాటుతోనే అప్పుల కుప్పగా మారబోయే మూడో డిస్కంకు బదిలీపై వెళ్లేందుకు ఉద్యోగులు జంకుతున్నారు. ఎలాగైనా బదిలీ చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం అవసరమైతే ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ప్రతిపాదించింది. కానీ, ఈ డిస్కంను ప్రైవేటీకరిస్తారనే భయంతో చాలా మంది ఉద్యోగులు వెళ్లేందుకు జంకుతున్నారని, సర్వీస్​ రూల్స్​ విషయంలోనూ స్పష్టత లేకపోవడమూ మరో కారణమని అధికారులు చెప్తున్నారు.