తిరువనంతపురం: వరుసగా రెండు విజయాలతో దూకుడు మీదున్న ఇండియా విమెన్స్ జట్టు.. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఇక్కడే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని హోమ్ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. తొలి రెండు టీ20ల్లో ఇండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించింది.
ఫలితంగా లంకపై గత 11 మ్యాచ్‌ల్లో 9వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కూడా అదే ఫామ్‌ను కొనసాగించి మరోసారి లంకపై పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇండియా ఒకే ఒక్క మార్పు చేసే అవకాశం ఉంది. జ్వరంతో రెండో మ్యాచ్‌కు దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి రావొచ్చు.
గత రెండు మ్యాచ్‌ల్లో జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ బ్యాటింగ్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టారు. వీళ్లకు తోడుగా స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. బౌలింగ్‌లోనూ ఇండియాకు తిరుగులేదు. స్పిన్నర్లు లంకను వరుసగా 121/6, 128/9 స్కోరుకే పరిమితం చేశారు. యంగ్ టాలెంట్ ప్లేయర్లు శ్రీచరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో వికెట్లు తీయడంతో పాటు రన్స్ కూడా నిరోధించారు.
పని భారాన్ని కూడా ఈ ముగ్గురు సమర్థవంతంగా పంచుకున్నారు. స్నేహ్ రాణా కూడా 4 ఓవర్లలో కేవలం 11 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీసింది. దాంతో ఇండియా బౌలింగ్ బలం సంపూర్ణంగా ఉందని తేలిపోయింది. తొలి మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు వదిలేసి ఆందోళనకు గురి చేసిన ఫీల్డింగ్.. రెండో మ్యాచ్‌లో మెరుగుపడింది. మూడు పదునైన రనౌట్స్‌తో గణనీయమైన మార్పును చూపెట్టారు. చివరి మూడు మ్యాచ్‌లకు తిరువనంతపురం ఆతిథ్యం ఇస్తుండటంతో తమ ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవాలని హర్మన్‌సేన భావిస్తోంది.
బ్యాటింగ్‌పైనే దృష్టి..
వరుస ఓటములతో కుంగిపోయిన లంక ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. వేదిక మారడంతో తమ అదృష్టాన్ని కూడా మార్చుకోవాలని భావిస్తోంది. అయితే ఇది జరగాలంటే బ్యాటర్లు మెరవాల్సిన అవసరం చాలా ఉంది. ఇండియాతో పోలిస్తే ఆట నాణ్యతలో చాలా వ్యత్యాసం ఉండటం లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. స్టార్టింగ్‌లో మెరుగైన ఆరంభం లభిస్తున్నా.. ఇన్నింగ్స్ చివరలో వరుసగా వికెట్లు పడటంతో భారీ స్కోరు చేయలేకపోతున్నారు.
తొలి మ్యాచ్‌లో విష్మీ గుణరత్నే 39 రన్స్ చేయడానికే నానా కష్టాలుపడింది. అదే సమయంలో హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ బ్యాటింగ్‌లో కుదురుకున్నట్లు కనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. రెండో టీ20లోనూ అదే విధంగా సాగింది. కెప్టెన్ చామిరి ఆటపట్టు ఉన్నంతవరకు లంక ఇన్నింగ్స్ గాడిలోనే ఉంది. కానీ ఆ తర్వాతే దారుణంగా కుప్పకూలారు.
మూడు రనౌట్లతో సహా 26 రన్స్‌కే ఆరు వికెట్లు కోల్పోయారు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. బౌలింగ్‌లోనూ పెద్దగా పదును కనిపించడం లేదు. ఇండియా బ్యాటింగ్‌ను ఇబ్బందిపెట్టే స్థిరమైన బౌలర్లు కరువయ్యారు. కాబట్టి తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం 150కి పైగా టార్గెట్‌ను నిర్దేశించాలి. అప్పుడు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు.
తుది జట్లు (అంచనా)
ఇండియా: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, స్నేహ్ రాణా / దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, శ్రీచరణి.
శ్రీలంక: చామిరి ఆటపట్టు (కెప్టెన్), విష్మీ గుణరత్నే, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షిక సిల్వ, కౌశిని నూత్యంగణ, కావిషా దిల్హారి, మల్కి మదారా, ఇనోకా రనవీర, కావ్య కావిండి, శషిని గిమ్హాని.
పిచ్, వాతావరణం
గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం ఇప్పటివరకు నాలుగు మెన్స్ టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. చివరిది నవంబర్ 2023 లో జరిగింది. మొదటి మూడు టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇబ్బందులను ఎదుర్కొన్నది. వాతావరణం మేఘావృతంగా ఉన్నా వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది.
మరో రెండు వికెట్లు తీస్తే దీప్తి శర్మ టీ20ల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకుంటుంది. మరో నాలుగు వికెట్లు పడగొడితే ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కుతుంది. 2019 నవంబర్ నుంచి వరుసగా 92 మ్యాచ్‌లు ఆడిన దీప్తి తొలిసారి శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌కు దూరమైంది.
92 టీ20 మ్యాచ్‌లు ఆడిన షెఫాలీ ఎనిమిదిసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకుంది. విమెన్స్ టీ20ల్లో ఇండియా తరఫున ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ ముందున్నారు.
