చూడముచ్చటైన చింతల మాధర 

చూడముచ్చటైన చింతల మాధర 

అడవి తల్లి ఒడి అంటేనే మనసుకి హాయినిచ్చే చోటు. అందుకే, వీకెండ్​ వచ్చిందంటే చాలు చాలామంది ప్రకృతి బాట పడతారు. కళ్లు తిప్పుకోనివ్వని ప్రకృతి అందాల నడుమ కేరింతలు కొడుతూ, ఫొటోలు దిగుతూ మస్త్ ఎంజాయ్​ చేస్తారు. ఈ సీజన్​లో చూడదగ్గ టూరిస్ట్​ ప్లేస్​​లు తెలంగాణలో బోలెడు ఉన్నాయి. వాటిల్లో ఒకటి చింతలమాధర వాటర్​ఫాల్. ఎటుచూసినా పచ్చదనంతో ఆకుపచ్చ చీర కట్టినట్టు ఉండే కుమ్రం భీం అసిఫాబాద్​ జిల్లాలో ఉంది ఈ  జలపాతం.
దట్టమైన అటవీ ప్రాంతంలోని తిర్యాని మండలం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వాటర్​ఫాల్. దీన్ని ‘తిర్యానీ వాటర్​ఫాల్​’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ యాభై అడుగుల ఎత్తు ఉన్న బండరాయి మీద నుంచి నీళ్లు కిందకు జారుతున్న దృశ్యం చూస్తుంటే చాలా థ్రిల్లింగ్​గా అనిపిస్తుంది. వాటర్​ఫాల్​ దగ్గరికి వెళ్లే తొవ్వంతా కొండలు, పచ్చదనంతో చూడముచ్చటగా ఉంటుంది. జలపాతానికి వెళ్లే దారిలోనే గిరిజనుల ఇళ్లు ఉంటాయి.  వాళ్ళ కట్టూబొట్టూ, బతుకు చిత్రాన్ని దగ్గరగా చూడడం మర్చిపోలేని ఫీల్​ని ఇస్తాయి. ఈ వాటర్​ఫాల్​కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ జలపాతంలోని నీళ్లు  నీలం రంగులో, చాలా తేటగా ఉంటాయి. మంచిర్యాల, జైనూర్​ ప్రాంతాల నుంచి సెలవురోజుల్లో చాలామంది ఇక్కడికి వస్తుంటారు. కొందరు ఫ్యామిలీతో పిక్నిక్​కు​ వచ్చి ఎంజాయ్​ చేస్తారు. తెలంగాణలో ఇంత క్లీన్​ వాటర్​ ఉన్న  మరొక టూరిస్ట్​ ప్లేస్​ ఏటూరు నాగారంలోని కొంగల (పులిమడుగు)వాటర్​ ఫాల్​ మాత్రమే.