ఫలక్‌నుమా దాస్, ధమ్కీ లాంటి చిత్రాలతో దర్శక నిర్మాతగానూ మెప్పించిన హీరో విశ్వక్‌సేన్.. ఇప్పుడు ‘కల్ట్’ చిత్రంతో మరోసారి మెగాఫోన్ పట్టాడు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తరుణ్ భాస్కర్ డైలాగ్స్, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. శనివారం (ఫిబ్రవరి 21) టీజర్‌ను రిలీజ్ చేశారు.
కంప్లీట్ బ్లడ్ బాత్‌తో రా అండ్ రస్టిక్‌గా సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ ‘టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. ఈ చిత్రం ద్వారా వందమంది కొత్త వారిని పరిచయం చేయబోతున్నాం. లాస్ట్ షెడ్యూల్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. పదిహేను రోజుల్లో అది కూడా పూర్తవుతుంది. తరుణ్ భాస్కర్‌తో నాకు స్పెషల్ బాండింగ్ ఉంది. ఈ చిత్రానికి తను రాసిన డైలాగ్స్ బాగా పేలతాయి.
‘ఫలక్‌నుమా దాస్’ కంటే పదింతలు కసితో ఈ సినిమా తీశా. పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండండి’ అని అన్నాడు. ఇదొక క్రేజీ ఎపిక్ ఫిల్మ్ అని హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ చెప్పింది. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘విశ్వక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కల్ట్ రెస్పాన్స్, కల్ట్ కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నా’ అని అన్నాడు. ఈ సినిమాలో మెస్మరైజింగ్ సౌండ్ వింటారని, తనను నమ్మిన విశ్వక్‌కు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ థ్యాంక్స్ చెప్పాడు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
