ఇల్లు కొనడానికి ఇదే రైట్ టైమ్!

ఇల్లు కొనడానికి ఇదే రైట్ టైమ్!
  • తక్కువ వడ్డీకే లోన్లు  
  • ఆకర్షిస్తున్న డెవలపర్ల ఆఫర్లు
  • ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే దూరంగా ఉండండి

బిజినెస్ డెస్క్, వెలుగు: ఇల్లు కొనాలనుకుంటున్నారా! అయితే ఇదే మంచి టైమ్. గత పదేళ్లలోని రియల్ ఎస్టేట్ ధరలు పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం తక్కువ ధరకే ప్రాపర్టీలు దొరుకుతున్నాయి. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు హోమ్ లోన్స్ పై  వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. దీంతో అఫర్డబిలిటీ(కొనుగోలు సామర్ధ్యం) మెరుగుపడుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. అంతేకాకుండా గత 10 ఏళ్లను పరిశీలిస్తే ప్రజల ఇన్‌క‌మ్ కూడా పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం టాప్ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లు 6.70 శాతానికే హోమ్ లోన్స్‌ను  ఇస్తున్నాయి. కోటక్ బ్యాంక్  6.65 శాతానికి హోమ్ లోన్ను ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ నుంచి హోమ్ లోన్ను 6.75 శాతానికే పొందొచ్చు. కిందటేడాది జనవరిలో హోమ్లోన్స్పై వడ్డీ రేట్లు యావరేజ్గా 8 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలోనే వడ్డీ రేట్లు 1 శాతానికి పైగా తగ్గడం విశేషం. మరోవైపు రియల్ ఎస్టేట్ ధరల కంటే ప్రజల ఆదాయాలు వేగంగా పెరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. బ్రోకరేజి కంపెనీ జెఫరీస్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2013 నుంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల ధరల పెరుగుదల 1–2 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) గా ఉంది. ఇది ఇన్ఫ్లేషన్ కంటే దిగువన ఉండడం గమనార్హం.

ఇతర మెట్రోలు కంటే హైదరాబాద్లో బెటర్.. 

కొన్ని ఏరియాలను మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల 2013 నుంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ధరలు పెద్దగా పెరగలేదని స్క్వేర్ యార్డ్స్ ఫౌండర్  పీయుష్ బాత్రా అన్నారు. ఇదే టైమ్లో ప్రజల ఆదాయాలు ఏడాదికి యావరేజ్గా 8–10 శాతం పెరిగాయని చెప్పారు. అఫర్డబిలిటీ అంటే  కన్జూమర్ల ఆదాయానికి ఖర్చుకి మధ్య బ్యాలెన్స్ ఉండగలగడం. ఆర్థిక సంవత్సరం 2000 లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ధరలు బయ్యర్ల ఏడాది ఇన్కమ్ కంటే 5.9 రెట్లు ఎక్కువగా ఉండేవని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2020 నాటికి ప్రాపర్టీ ధరలు బయ్యర్ల ఏడాది ఇన్కమ్ కంటే యావరేజ్గా 3.3 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉందని తెలిపింది. దేశంలోని టాప్ 7 మెట్రో సిటీలలో  హోమ్ అఫర్డబులిటీ మెరుగుపడుతోందని జేఎల్ఎల్ ఇండియా అంచనావేస్తోంది. ఈ ఏడు సిటీలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే, కోల్కతాలు కాగా, ఇందులో కోల్కతా, హైదరాబాద్లలో హోం అఫర్డబిలిటీ ఎక్కువగా ఉంది. 

ఆకర్షిస్తున్న ప్రాపర్టీ డెవలపర్ల ఆఫర్లు..

ప్రాపర్టీ డెవలపర్లు బయ్యర్లను ఆకర్షించడానికి అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఇల్లు కొనాలనుకునే వారు డెవలపర్లు ఇస్తున్న ఆఫర్ల వలన ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అనరాక్ ప్రాపర్టీ చైర్మన్ అనుజ్ పురి అన్నారు. అనరాక్ చేసిన సర్వేలో 36 శాతం మంది రెస్పాండెంట్లు డెవలపర్లు ఇస్తున్న ఆఫర్ల వలన ఇల్లు కొంటామని చెప్పారు. 25 శాతం మంది రెస్పాండెంట్లు మాత్రమే హోమ్లోన్స్ చౌకగా ఉన్నాయని, అందుకే ఇల్లు కొనాలనుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే చాలా మంది ఇల్లు కొనడం ప్రారంభించారని అండ్రొమెడా సీఓఓ రావుల్ కపూర్ అన్నారు. ఇందులో ఎక్కువ మంది ఫస్ట్ టైమ్ బయ్యర్లేనని పేర్కొన్నారు. అంతేకాకుండా పెద్ద హౌస్ తీసుకోవాలనుకునే వారు పెరిగారని అభిప్రాయపడ్డారు. ఇల్లు కొనాలనే ప్లాన్లో ఉంటే ప్రస్తుతం కొనుక్కోవడం బెటర్ అని, అంతేగాని హోమ్ లోన్స్పై వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు తక్కువగా ఉన్నాయని కొనద్దని నిపుణులు సలహాయిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వారు రియల్ ఎస్టేట్లో పెట్టొదని చెబుతున్నారు. ఇప్పట్లో ప్రాపర్టీ ధరలు పెద్దగా పుంజుకోవని తెలిపారు. ఇల్లు కొనాలని ఉంటే కొనుగోలు చేయడం బెటర్ అని, ఇన్వెస్ట్మెంట్ కోసం వద్దని పేర్కొంటున్నారు.

వడ్డీ రేటు 1 % కంటే ఎక్కువ తగ్గింది..

తక్కువ ధరకే ఇల్లు దొరుకుతున్నప్పుడు బయ్యర్లు తమ ఇన్‌క‌మ్ లెవెల్స్‌ను బట్టి పెద్ద ప్రాపర్టీలను కొనుగోలు చేసుకునే వీలుంటుంది. గతేడాదితో పోలిస్తే హోమ్ లోన్ రేట్లు 1.2–1.3 శాతం పడ్డాయి. అంటే ఒక బయ్యరు నెలకు నికరంగా రూ. లక్ష సంపాదిస్తున్నాడనుకుందాం. 8 శాతం వడ్డీ రేటు వద్ద గరిష్టంగా రూ. 59.78 లక్షలను మాత్రమే పొందగలుగుతాడు. అదే ప్రస్తుతం ఉన్న 6.7 శాతం వడ్డీ రేటు వద్ద అదనంగా రూ. 6.24 లక్షలను పొందే వీలుంటుంది. లేదు లోన్ అమౌంట్ రూ. 59.78 లక్షలే కావాలనుకుంటే మంత్లీ ఈఎంఐలు భారీగా తగ్గుతాయి. ఉదాహరణకు రూ. 50 లక్షల లోన్ను 20 ఏళ్లకు గాను తీసుకుంటే 8 శాతం వడ్డీ వద్ద నెలకు రూ. 41,822 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదే 6.7 శాతం వద్ద ఇది రూ. 37,870 కి తగ్గుతుంది.