జగిత్యాలలో2 లక్షల మందితో భారీ బహిరంగ సభ: హరీష్ రావు

జగిత్యాలలో2 లక్షల మందితో భారీ బహిరంగ సభ: హరీష్ రావు

ఈ నెల 7న జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెండు లక్షల మందితో జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవనంతో పాటు మెడికల్ కాలేజీ, నూతన పార్టీ ఆఫీస్ లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వల్లే జగిత్యాల జిల్లా ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందన్న మంత్రి... ఈడీ, ఐటీ దాడులతో తమను బెదిరించలేరన్నారు. రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం... కావాలనే కేంద్ర పథకాల వాటాలో కోత విధిస్తోందని ఆరోపించారు. 42 శాతం వాటా ఇస్తున్నారని చెప్తున్నారు కానీ ఇచ్చేది 29.6 శాతమేనన్నారు. 

మంత్రి కిషన్ రెడ్డి రూ.8వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని చెప్తున్నారని, రాష్ట్రం రూ.30వేల కోట్లు కేంద్రానికి ఇస్తే  రాష్ట్రానికి ఇచ్చింది కేవలం ఎనిమిది కోట్లేని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ విషయంలో కిషన్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అప్పుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ .. కేంద్రం నెలకు లక్ష కోట్లు అప్పు చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ చేస్తున్నటువంటి పాదయాత్రలో జనాలు లేక విలవిలబోతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకుల అసత్య ప్రచారాలు నమ్మడానికి ఇది ఎడ్డీ తెలంగాణ కాదన్న మంత్రి హరీష్ రావు.. ఇది ఉద్యమాల గడ్డ అని చెప్పారు.