అసెంబ్లీ ఎన్నికల వల్లే.. హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు లేవా !

అసెంబ్లీ ఎన్నికల వల్లే.. హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు లేవా !

వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.దేశవ్యాప్తంగా 10 వేదికలను ఖరారు చేస్తూ ప్రకటన కూడా ఇచ్చేశారు. కాకపోతే హైదరాబాద్ విషయంలో మాత్రం క్రికెట్ అభిమానులకు కాస్తంత అసంతృప్తి ఉంది. ఉప్పల్ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్నా.. కేవలం మూడు మ్యాచులకు మాత్రమే పరిమితం చేస్తూ.. అది కూడా వారం రోజుల్లోనే హైదరాబాద్ లో షెడ్యూల్ ముగిసేలా చేయడమన్నది అందరిలో చర్చనీయాంశం అయ్యింది.

వాస్తవంగా అయితే ఉప్పల్ స్టేడియం వేదికగా కనీసం మూడు నుంచి నాలుగు ప్రధాన జట్ల మ్యాచులు ఉండనున్నట్లు షెడ్యూల్ ప్రిపరేషన్ సమయంలో వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ షెడ్యూల్ సమయానికి.. పది రోజుల్లోనే హైదరాబాద్ లో మ్యాచులు లేవని ప్రకటించటం వెనక కారణాలు ఏంటీ అనేది చర్చ అయ్యింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అక్టోబర్ రెండో వారం తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటం వల్లే మ్యాచులు కుదించినట్లు తెలుస్తోంది. ఐసీసీ వన్డ్ వరల్డ్ కప్ అంటే అంతర్జాతీయ క్రీడాకారులు వస్తుంటారు. మూడు రోజులు భద్రతా పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రికెట్ కోసం పోలీసులను కేటాయిస్తే.. అసెంబ్లీ ఎన్నికల విధులకు సెక్యూరిటీ తగ్గిపోతుందని కేంద్ర హోంశాఖ భావించినట్లు సమాచారం. ఓ వైపు క్రికెట్.. మరో వైపు ఎన్నికల కోసం భద్రతా సిబ్బందిని కేటాయించటం కష్టం అవుతుందనే ఉద్దేశంతో.. మ్యాచ్ ల నిర్వహణ నుంచి ఉప్పల్ స్టేడియం ఔట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఏదేమైనా హైదరాబాద్‌లో టీమిండియా మ్యాచ్ లేకపోవడంపై తెలుగు అభిమానులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో క్రికెట్ అభిమానులకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. ఇంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం  ఏమొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.