ఇయ్యాల్నే కాకా ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 టోర్నీ మెగా ఫైనల్.. ఖమ్మం, నిజామాబాద్ జట్ల మధ్య తుదిపోరు

ఇయ్యాల్నే కాకా ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 టోర్నీ మెగా ఫైనల్.. ఖమ్మం, నిజామాబాద్ జట్ల మధ్య తుదిపోరు

హైదరాబాద్, వెలుగు:  కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ఖమ్మం, నిజామాబాద్ జట్లు ఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లాయి. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ జింఖానా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌లో రెండు జట్లూ హోరాహోరీగా పోరాడాయి. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఖమ్మం 6 వికెట్ల తేడాతో నల్లగొండను ఓడించింది.

 రెండో సెమీస్‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్ 7 వికెట్ల తేడాతో ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌పై ఘన విజయం సాధించింది. శనివారం మధ్యాహ్నం జింఖానా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఖమ్మం, నిజామాబాద్ జట్లు తలపడతాయి. సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఓడిన ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, నల్లగొండ జట్లు థర్డ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌ కోసం పోటీ పడతాయి. విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేస్తున్న ఈ టోర్నీలో విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచే టీమ్‌‌‌‌‌‌‌‌కు రూ.5 లక్షల ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ లభిస్తుంది. ఈ మ్యాచ్‌‌కు మంత్రులు వివేక్‌‌ వెంకటస్వామి, ఉత్తమ్​కుమార్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌‌‌, అజారుద్దీన్​ హాజరుకానున్నారు.

లాస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కు ఖమ్మం థ్రిల్లింగ్ విక్టరీ

ఖమ్మం, నల్లగొండ మధ్య ఫస్ట్ సెమీఫైనల్ లాస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌ వరకూ థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నల్లగొండ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. మణికరణ్ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) ఫిఫ్టీతో సత్తా చాటగా.. జశ్వంత్ యాదవ్ (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 49), జ్ఞానప్రకాష్ (26 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 46) మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లు ఆడారు. ఖమ్మం బౌలర్లలో ఎస్.వంశీ 3 వికెట్లు పడగొట్టి నల్లగొండను కట్టడి చేసే ప్రయత్నం చేయగా, శివ నాగేంద్ర 2 వికెట్లు తీశారు. 

అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం... 4  వికెట్లు కోల్పోయి ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కు విజయాన్ని అందుకుంది. బన్నీ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 64), తేజ నాయుడు (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీలతో హోరెత్తించగా, రిజ్వాన్ (28 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 41) కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో ఖమ్మం విజయానికి  12 రన్స్ అవసరం అవగా.. రెండో బాల్‌‌‌‌‌‌‌‌కు తేజ రనౌటవ్వడంతో  ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. అయితే మూడో బాల్‌‌‌‌‌‌‌‌కు సిక్స్ కొట్టిన  బన్నీ లాస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కు  డీప్ మిడ్ వికెట్ మీదుగా ఫోర్ కొట్టి ఖమ్మంను గెలిపించాడు. బన్నీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. 

శ్రీకర్ రెడ్డి అజేయ పోరాటం

రెండో సెమీస్‌‌‌‌‌‌‌‌లో నిజామాబాద్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌, ఓపెనర్ యెడ్ల శ్రీకర్ రెడ్డి (63 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 నాటౌట్‌‌‌‌‌‌‌‌) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆదిలాబాద్ 20 ఓవర్లలో 168 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. ఏ.సంతోష్ (38 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 62) ఒంటరి పోరాటం చేశాడు. నిజామాబాద్ బౌలర్ ఎం.సాయి ప్రతీక్ 3 వికెట్లతో ఆదిలాబాద్ నడ్డివిరిచాడు. అనంతరం నిజామాబాద్ 18.4 ఓవర్లలో 170/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. శ్రీకర్​కు విక్రమ్ జాదవ్ (34) సహకరించాడు. ఆదిలాబాద్ బౌలర్ ఇస్మాయిల్ అహ్మద్ 3 వికెట్లు తీసినప్పటికీ ఓటమిని తప్పించలేకపోయాడు. శ్రీకర్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.