ఈ సీజన్​లో బీమార్లు రాకుండా..

ఈ సీజన్​లో బీమార్లు రాకుండా..

వానాకాలంలో బయట ఏదన్నా తినాలన్నా, ఏమన్నా తాగాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు చాలామంది. అంతేకాదు, ఈ కాలంలో జ్వరం వచ్చినా, తలనొప్పిగా ఉన్నా ‘ఏం కాదులే. వెంటనే తగ్గిపోతుందిలే’ అనుకోవడానికి లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సీజన్​ ఇది. ఎందుకంటే.. ఈ సీజన్​లో దోమలు, కలుషితమైన నీళ్లు, ఫుడ్ కారణంగా బ్యాక్టీరియా, వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి. అందుకని ఈ సీజన్​లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం అంటున్నారు డా. ప్రశాంత్ చంద్ర.  
 

ఈ జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు  ఆయన చెప్తున్న జాగ్రత్తలివి... 
చినుకులు పడే ఈ కాలంలో రోడ్ల మీద వాననీళ్లు పారుతుంటాయి. చెత్తాచెదారంతో నిండిన వరద నీళ్ల వల్ల తాగేనీళ్లు కలుషితం అవుతాయి. ఆ నీళ్లు తాగితే జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కారణం... కలుషితమైన నీళ్లలో టైఫాయిడ్, పసరికలు, కలరా వంటి జ్వరాలకు కారణమయ్యే బ్యాక్టీరియాలు ఉంటాయి. అంతేకాదు ఈ సీజన్​లో కలుషితమైన, ఈగలు వాలిన ఫుడ్ తిన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.   

జ్వరం, విరేచనాలు ఉంటే ... అది డయేరియా. దీనివల్ల  శక్తి తగ్గిపోతుంది. నీరసంగా కనిపిస్తారు. బరువు కూడా తగ్గుతారు. ఓఆర్​ఎస్​ నీళ్లు తాగితే రిలీఫ్​గా ఉంటుంది.   టైఫాయిడ్ జ్వరం రావడానికి సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా కారణం. కలుషితమైన ఫుడ్​ తిన్నా, నీళ్లు తాగినా టైఫాయిడ్ వస్తుంది. నీళ్ల విరేచనాలతో పాటు శరీరం మీద ఎర్రని మచ్చలు కనిపిస్తాయి. విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి.తగ్గకుండా ఉంటే టైఫాయిడ్​ ఉందో లేదో తేల్చడానికి వైడల్ టెస్ట్ చేస్తారు. టైఫాయిడ్​కి వ్యాక్సిన్​ ఉంది. పిల్లలకు ఈ వ్యాక్సిన్​ ఇప్పిస్తే ఈ జ్వరం రాకుండా జాగ్రత్తపడొచ్చు. పెద్దవాళ్లు ఇమ్యూనిటీ ఫుడ్ తింటే టైఫాయిడ్ జ్వరం రాకుండా చూసుకోవచ్చు. ఈమధ్య కొన్ని ప్రాంతాల్లో  కలరా ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి. ఇదొక బ్యాక్టీరియల్ డిసీజ్. కలుషితమైన నీళ్లు తాగడం వల్ల కలరా వస్తుంది.  వికారం, వాంతులు వంటి లక్షణాలు మొదట కనిపిస్తాయి. పలుచటి విరేచనాలు అవుతాయి. డీహైడ్రేట్ అవుతారు.  వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాల మీదకి వస్తుంది. 

పసరికలు‌‌‌‌... వీటినే పచ్చకామెర్లు అంటారు. వీటిలో తెల్ల పసరికలు, పచ్చ పసరికలు అని రెండు రకాలు. ఈ సమస్య ఉన్నవాళ్లలో లివర్​లో బైలురుబిన్ అనే రసాయనం ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో లివర్​​ పనితీరు దెబ్బతింటుంది. కడుపునొప్పి, జ్వరం, వాంతులతో పాటు కళ్లు పసుపు రంగులోకి మారతాయి. మూత్రం పసుపు పచ్చగా వస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్​ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ సీజన్​లో వచ్చే హెపటైటిస్​ డిసీజ్​లలో ఎ, ఇ రకాలు ఎక్కువ. వీటిని సీరాలజీ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేస్తారు. అయితే హెపటైటిస్​–బి, సి లాగ ఇవి ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టవు.  వారం పదిరోజుల్లో తగ్గిపోతాయి. అయితే వందమందిలో ఒకరిద్దరికి తీవ్రమైన లక్షణాలు కనిపించి లివర్​ దెబ్బతినే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్లలో వీటి ప్రభావం ఎక్కువ. ఈ వ్యాధులన్ని కలుషితమైన నీళ్లు తాగడం, ఫుడ్ తినడం వల్ల వస్తాయి. ఇవేకాకుండా దోమల వల్ల వచ్చే జ్వరాలు మరికొన్ని ఉన్నాయి. వర్షాకాలంలో వైరల్ ఫీవర్లు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం దోమలు. ఇవి గుంతలు, కాల్వల్లో  నిల్వ ఉండే నీళ్లపై ఉంటాయి. వాటిలో గుడ్లు పెట్టి, వాటి సంఖ్య పెంచుకుంటాయి. దోమలు కుట్టడం వల్ల  డెంగీ, చికెన్​గున్యా, మలేరియా వంటి వైరల్ ఫీవర్లు వస్తాయి. 

వర్షాకాలంలో వచ్చే జ్వరాల్లో డెంగీ ముఖ్యమైనది. డెంగీ వైరస్​ వల్ల ఈ జ్వరం వస్తుంది. ఈ వైరస్​లలో నాలుగు రకాలు ఉంటాయి. డెంగీ వచ్చినవాళ్లలో తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. బ్లడ్ టెస్ట్ చేసి డెంగీ ఉందో లేదో తేలుస్తారు. అయితే లక్షణాలు కనిపించగానే డాక్టర్​ని కలిసి టెస్ట్ చేయించుకోవాలి. 
 టైగర్ ఎడిస్ అల్బొపిక్టస్ అనే దోమ కుట్టడం వల్ల చికెన్ గున్యా​ వస్తుంది. దీన్ని చికెన్ గున్యా సీరాలజీ టెస్ట్ ద్వారా డయాగ్నోస్​ చేస్తారు. ఈ జ్వరం వస్తే... కీళ్లు బాగా నొప్పిపెడతాయి.  జ్వరం ఉంటుంది. తలనొప్పి, వికారం, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికెన్​గున్యా డయాగ్నోస్​ కోసం ఎంజైమ్ లింక్​డ్​ ఇమ్యూనోసార్బెంట్ అస్సే (ఎలిసా టెస్ట్) సీరలాజికల్ టెస్ట్ చేస్తారు. జ్వరం తగ్గడానికి పారసెటమాల్ ఇస్తారు. నీళ్లు, పండ్లరసాలు, మజ్జిగ వంటివి బాగా తాగితే తొందరగా కోలుకుంటారు. ఆడ ఎనాఫిలస్ అనే దోమకాటు వల్ల మలేరియా వస్తుంది. దోమ కుట్టిన రెండు వారాల్లో లక్షణాలు బయటపడతాయి. మలేరియా రకాన్ని బట్టి 24 గంటలు జ్వరం ఉంటుంది. చలితో జ్వరం రావడం మలేరియా ప్రధాన లక్షణం. వణుకు, ఒళ్లు నొప్పులు ఉంటాయి.  స్మియర్ టెస్ట్ ద్వారా మలేరియాని డయాగ్నోస్ చేస్తారు.  యాంటీమలేరియా మెడిసిన్స్​తో ట్రీట్మెంట్ చేస్తారు.  జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం లిక్విడ్ వేపరైజర్​, మస్కిటో రెపల్లెంట్స్ వాడాలి. దోమతెరలు ఉపయోగించాలి. కిటికీలకి మెష్​ ఏర్పాటుచేసుకోవాలి. సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసేస్తే, దోమలు ఇంట్లోకి రావు. అంతేకాకుండా ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ కాకుండా చూడాలి. వీటితో పాటు పూలకుండీల్లో, పాత టైర్లు, క్యాన్లలో, పాత కూలర్లలో నీళ్లు ఉంటే వాటిని తీసెయ్యాలి. అంతేకాదు, ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయిస్తుంటే దోమలు పెరగవు.
 

పాటించాల్సినవి
శుభ్రంగా లేని ప్లేస్​లో, చిరుతిండి బండ్ల దగ్గర నీళ్లు తాగొద్దు. 
 ఫిల్టర్​ నీళ్లు లేదా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి.  బయటికి వెళ్లేటప్పుడు వాటర్​బాటిల్​లో నీళ్లు తీసుకెళ్తే ఇంకా మంచిది. 
 పిల్లల్ని వాననీళ్లలో ఆడనివ్వొద్దు. 
 వంటకాల మీద మూతలు పెట్టడం తప్పనిసరి. 
 బాత్​రూమ్​కి వెళ్లొచ్చిన తర్వాత చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. 
 అలాగే తినేముందు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 
 బయటికి వెళ్లేముందు దోమలు కుట్టకుండా ఫుల్​ హ్యాండ్ డ్రెస్​ వేసుకోవాలి. 
  బయటి ఫుడ్​ ఎక్కువ తినొద్దు. 
    సి–విటమిన్ ఉన్న ఫుడ్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.                  డా.ఎన్​.వై. ప్రశాంత్ చంద్ర సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్​ మెడిసిన్కేర్​ హాస్పిటల్స్​, హైదరాబాద్.