ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజులు వానలు

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో  మరో 4 రోజులు వానలు
  • 14 రోజుల్లోనే సాధారణం  కంటే 285 శాతం అధికం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల నుంచి కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఎనిమిదేండ్లలో ఇంత భారీ వర్షాలు ఎప్పుడూ పడలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. జులై మొదటి 14 రోజుల్లోనే సాధారణ వర్షపాతం కన్నా 285 శాతం అధికంగా నమోదైంది. 2015 నుంచి చూస్తే.. ఇదే రికార్డు స్థాయి వర్షపాతం. నిరుడు  హైదరాబాద్ నగరాన్ని గులాబ్ తుఫాన్​ ముంచెత్తింది. 2021 అక్టోబరు 27న భారీ వర్షంతో జంట నగరాలు అతలాకుతలమయ్యాయి. ఆ రోజు సాధారణ వర్షపాతం 2.7 మిల్లీ మీటర్లు కాగా రికార్డు స్థాయిలో 12.2 మిల్లీ మీటర్ల వాన పడింది. ఇంచుమించు నాలుగు రెట్లు అధికంగా వానలు పడ్డాయి. అలాంటి పరిస్థితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్నట్లు వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. మరో 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇదే వాతావరణం కొనసాగుతుందని ప్రకటించింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని  పేర్కొంది.