కలలుగంటడు.. కన్నమేస్తడు

కలలుగంటడు.. కన్నమేస్తడు

చోరీ డబ్బులతో మూడంతస్తుల బిల్డింగ్ కట్టిండు
గుంటూరు జిల్లాకు చెందిన దొంగ అరెస్టు
2.30 కిలోల బంగారం, 10.3 కిలోల వెండి స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దొంగల్లో ఇతడో వెరైటీ. ఉండేది గుంటూరు.. చోరీలు చేసేది హైదరాబాద్‌‌‌‌లో. దొంగతనానికి బయలుదేరే ముందు సిటీలోని ఏరియాలను ఊహించుకుంటడు. కలలో వచ్చిన ఏరియాల పేర్లను రాసి చిట్టీలు వేసుకుని సెలెక్ట్ చేసుకుంటడు. సైలెంట్‌‌‌‌గా వచ్చి.. అంతే సైలెంట్‌‌‌‌గా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతడు. ఒకటీ రెండు కాదు.. 30 ఏండ్లుగా ఇదే కథ. 60కి పైనే దొంగతనాలు చేసి చివరికి మల్కాజిగిరి ఎస్‌‌‌‌వోటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 2.30 కిలోల బంగారం, 10.3 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ వెల్లడించారు.

1989 నుంచి వరుస చోరీలు

ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గాంధీనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ముచ్చు అంబేద్కర్‌‌‌‌(50) అలియాస్‌‌‌‌ రాజు చోరీలనే వృత్తిగా చేసుకున్నాడు. గుంటూరు నుంచి హైదరాబాద్‌‌‌‌ వచ్చి కాలనీల్లో తాళాలు వేసిన ఇండ్లను పగటిపూట గుర్తించేవాడు. రాత్రిళ్లు ఇంట్లోకి వెళ్లి. బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. చోరీ చేశాక ఇందిరాపార్క్‌‌‌‌తోపాటు సిటీలోని ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై షెల్టర్‌‌‌‌‌‌‌‌ తీసుకునేవాడు. మార్నింగ్‌‌‌‌ వాకర్లతో కలిసి తిరిగేవాడు. మళ్లీ చోరీలకు అనువైన ఇండ్లను గుర్తించేవాడు. అందినంత దోచుకుని తిరిగి గుంటూరుకు వెళ్లేవాడు. ఇలా 1989 నుంచి 1991 వరకు హైదరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 21 చోరీలు చేశాడు. కొన్ని కేసుల్లో దొరికిపోయి కొన్నేండ్లు జైలులో ఉన్నాడు. 2016లో ఓయూ పీఎస్‌‌‌‌ లిమిట్స్‌‌‌‌లో చేసిన చోరీ కేసులో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై ఇప్పటిదాకా రాచకొండ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో 42, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లో 2 చోరీలు చేశాడు. 

బ్యాంకుల్లో తాకట్టుపెట్టి..

చోరీ విషయంలో రాజు కాస్త వెరైటీగా ఆలోచించే వాడు. ముందు సిటీలోని ఏరియాలను ఊహించుకుని కలలుగనే వాడు. కలలో వచ్చిన ఏరియాలను చిట్టీలు వేసుకుని సెలెక్ట్ చేసుకునేవాడు. చోరీ చేసి తెచ్చిన బంగారం కొనుగోలు చేసే రిసీవర్ల ద్వారా పోలీసులకు దొరికే అవకాశం ఉందని ముందుగానే జాగ్రత్తపడేవాడు. బంగారాన్ని పిడుగురాళ్లలోని ఇంటికి తీసుకెళ్లి పేపర్‌‌‌‌‌‌‌‌లో చుట్టి భద్రపరిచేవాడు. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా అమ్ముకునేవాడు. గోల్డ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీలు, బ్యాంకుల్లో కుదవపెట్టి తర్వాత తీసుకునేవాడు.  దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో పిడుగురాళ్లలో మూడంతస్తుల బిల్డింగ్‌‌‌‌ నిర్మించాడు. స్థానికులకు అనుమానం రాకుండా వ్యాపారం పనుల మీద హైదరాబాద్‌‌‌‌ వెళ్తున్నట్లు చెప్పి వెళ్లేవాడు.

రూ.1,800  కొట్టేసిన కేసులో దొరికిండు

గత నెల 17న వనస్థలిపురంలోని వైదేహినగర్‌‌‌‌‌‌‌‌లో మైన్స్‌‌‌‌ అండ్ జియాలజీ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ టాటా శ్యామ్‌‌‌‌రావు ఇంట్లో రాజు చోరీ చేశాడు. ఆయన తల్లి హ్యాండ్‌‌‌‌ బ్యాగ్‌‌‌‌లోని రూ.1,500, ఆయన భార్య హ్యాండ్‌‌‌‌ బ్యాగ్‌‌‌‌లోని రూ.300, ఐడీ కార్డులు ఎత్తుకెళ్ళాడు. శ్యామ్​రావు ఫిర్యాదుతో  పోలీసులు దర్యాప్తు చేశారు. రాజు వైదేహీనగర్‌‌‌‌‌‌‌‌లో చిక్కాడు. అతన్ని విచారించగా 2016 నుంచి చేసిన 43 చోరీల చరిత్ర బయటపడింది.