ఇంటర్ లో ‘నిమిషం’ నిబంధన

ఇంటర్ లో  ‘నిమిషం’ నిబంధన
  • మే 6 నుంచి ఎగ్జామ్స్
  • 9.07 లక్షల మంది స్టూడెంట్లకు 1,443 పరీక్షా కేంద్రాలు 
  • బెంచీకి ఒక్కరికే చాన్స్

హైదరాబాద్,వెలుగు: ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఈ నెల 6 నుంచి 24 వరకు నిర్వహించనున్న క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ రూల్స్ ను పాటిస్తూ, బెంచీకి ఒక్కరే కూర్చునేలా పరీక్షా కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. ఈ సారి కూడా నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు మొత్తం 9,07,394 మంది స్టూడెంట్స్ అటెండ్ కానున్నారు. దీంట్లో ఫస్టియర్ కు 4,64,626 మంది, సెకండియర్​కు 4,42,768 మంది అటెండ్ అవుతారు. వీరిలో 94,984 మంది ఒకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 1,443  ఎగ్జామ్ సెంటర్స్ ఎంపిక చేయగా.. గవర్నమెంట్ కాలేజీల్లో 386, గవర్నమెంట్ సెక్టార్ కాలేజీల్లో 206, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 840 , స్కూళ్లలో 11 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ కోసం మొత్తం1,443 మంది చీఫ్​ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లను నియమించారు. పరీక్షల నిర్వహణకు 25,513 మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేశారు. మాస్ కాపీయింగ్​ను నిరోధించడానికి 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 150 సిట్టింగ్ స్క్వాడ్స్​  రెడీ చేశారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. కొవిడ్ ఎఫెక్ట్​తో గత రెండేండ్లుగా సరిగా క్లాసులు జరగలేదు. దీంతో 70% సిలబస్​తోనే పరీక్షలు నిర్వహిస్తుండటంతో పాటు క్వశ్చన్ పేపర్లలోనూ చాయిస్​ను పెంచారు. ఫస్టియర్, సెకండియర్​లోనూ ఎంపీసీ స్టూడెంట్లు ఎక్కు వ మంది పరీక్షలకు అటెండ్ కానున్నారు. 

వెబ్ సైట్​లో హాల్ టికెట్లు: ఉమర్ జలీల్ 

ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన హాల్​టికెట్లను https://tsbie.cgg.gov.in  వెబ్ సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ సూచించారు. హాల్​ టికెట్ పై పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టులు వంటి అంశాలను పరిశీలించి, తప్పులేమైనా ఉంటే వెంటనే ప్రిన్సిపల్​ దృష్టికి తీసుకొని పోయి డీఐఈఓ ద్వారా వాటిని సరిచేసుకోవాలన్నారు. డౌన్​లోడ్ చేసుకున్న హాల్ ​టికెట్​పై కాలేజీ ప్రిన్సిపల్ పేరు లేకున్నా ఎగ్జామ్ సెంటర్​లోకి అనుమతిస్తారని చెప్పారు.