సన్​రైజర్స్​ బలాలు, బలహీనతలివే..

సన్​రైజర్స్​ బలాలు, బలహీనతలివే..
  • గతేడాది చెత్తాటతో విమర్శలు
  • ఈసారి కూడా బ్యాటింగ్‌‌లో బలహీనంగా సన్​రైజర్స్​ 

గత సీజన్‌లో చివరి స్థానం. ఫ్రాంచైజీకే వన్నె తెచ్చి టీమ్‌కు ఏకైక టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్‌ను అవమానకర రీతిలో  తప్పించడం.. బెయిర్ స్టో, రషీద్, హోల్డర్ లాంటి టాప్ ప్లేయర్లను వదులుకోవడం.. వేలంలో స్టార్లను కాదని అభిషేక్ శర్మ (6.50 కోట్లు) లాంటి అనామకులపై కోట్లు కుమ్మరించడం..  మరోసారి బ్యాటింగ్‌పై ఫోకస్ చేయలేదన్న విమర్శలు..  ఇన్ని ప్రతికూలతల నడుమ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌15కు రెడీ అయింది. 2016లో విజేతగా నిలిచిన హైదరాబాద్​ మళ్లీ టైటిల్​ కొడుతుందా? ఆరెంజ్​ ఆర్మీ రేంజ్​ ఈసారైనా మారుతుందా?

వెలుగు స్పోర్ట్స్ డెస్క్: నిరుడు చెత్తాటకు తోడు, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్ ను కెప్టెన్సీతో పాటు టీమ్‌‌కు దూరం చేయడం వంటి వివాదాస్పద నిర్ణయాలతో  డీలాపడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి బాగా ఆడాలన్న ఆశతో బరిలో దిగుతోంది. బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్​ లెజెండ్ బ్రియాన్ లారా, పేస్ బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్​ స్టెయిన్ ను తీసుకుని అంచనాలు పెంచుకుంది.  అయితే, పీడకల లాంటి 2021 సీజన్ ను మరిచిపోయి ఈ ఏడాదైనా బలమైన కొత్త ప్లేయర్లతో బరిలో నిలుస్తారనుకున్న ఫ్యాన్స్​ ఆశల్ని మెగా వేలంలోనే ఫ్రాంచైజీ అడియాశలు చేసింది. ఎప్పట్లానే కేవలం బౌలర్లపైనే ఫోకస్ చేసిన ఆరెంజ్​ ఆర్మీ మరోసారి బలహీన బ్యాటింగ్ లైనప్​తో పోటీపడనుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయం ఫ్యాన్స్‌‌ను మరింత కలవరపెడుతోంది. కేన్​ ఇప్పటికే ముంబై చేరుకున్నా.. తను అన్ని మ్యాచ్‌‌లకు అందుబాటులో ఉండేది అనుమానమే. తను దూరంగా ఉంటే  సౌతాఫ్రికా క్రికెటర్ మార్‌‌క్రమ్‌‌, ఇండియా పేసర్‌‌ భువనేశ్వర్‌‌లో ఒకరిని కెప్టెన్​గా నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 29న రాజస్థాన్​తో తొలి మ్యాచ్​ ఆడనున్న రైజర్స్​ అద్భుతం చేస్తే తప్ప ప్లే ఆఫ్స్‌‌ వరకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

బలాలు
ఇటీవల సూపర్ ఫామ్ లో కనిపిస్తున్న వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ సన్ రైజర్స్ కు పెద్ద ప్లస్ పాయింట్​. ఇండియాతో జరిగిన సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలతో మెరిసిన పూరన్.. లీగ్ లోనూ అదే ఫామ్ కొనసాగించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. టాపార్డర్ లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్, రాహుల్ త్రిపాఠి రూపంలో మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వేలానికి ముందు రిటైన్ చేసుకున్న యంగ్ క్రికెటర్ అబ్దుల్ సమద్ తో పాటు బిగ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ షెఫర్డ్  ఫినిషర్ పాత్ర పోషిస్తే టీమ్ కు తిరుగుండదు. బౌలింగ్ లో 140 కి.మీ. వేగంతో బాల్స్‌‌‌‌‌‌‌‌ వేసే చేసే కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ అక్మల్ అవతలి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. ఇక వాషింగ్టన్ సుందర్ రూపంలో మంచి స్పిన్ ఆప్షన్ ఉండనే ఉంది. 

బలహీనతలు
సన్​రైజర్స్​ పేపర్​పై  బలంగానే కనపడుతున్నా బరిలో దిగితే తప్ప వారి పెర్ఫామెన్స్ ను అంచనా వేయలేం. ఇండియా పిచ్ లపై ప్రత్యర్థి బ్యాటర్లను శాసించే స్పిన్ విభాగంలో ఈ టీమ్ వీక్ గా కనిపిస్తోంది. సుందర్ తప్ప మరో రెగ్యులర్ స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటు. రషీద్ ఖాన్ లాంటి టాప్ స్పిన్నర్ ను వదులుకున్న ఫ్రాంచైజీ ఆ స్థాయి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయలేకపోయింది. శ్రేయస్ గోపాల్, జగదీశ్ సుచిత్, అభిషేక్ శర్మ టీమ్ లో ఉన్నా.. వారి పెర్ఫామెన్స్ పై నమ్మకం ఉంచలేం. ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ తో పాటు యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ టీమ్​కు పెద్ద సమస్య. ఫారిన్‌‌‌‌‌‌‌‌ పేసర్లు షెఫర్డ్‌‌‌‌‌‌‌‌, జాన్సెన్‌‌‌‌‌‌‌‌, అబాట్‌‌‌‌‌‌‌‌ ఏ మాత్రం రాణిస్తారో చెప్పలేం. పైగా, విలియమ్సన్‌‌‌‌‌‌‌‌, పూరన్‌‌‌‌‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ తుది జట్టులో ఉంటే ఫారిన్‌‌‌‌‌‌‌‌ కోటాలో మరొకరికి మాత్రమే చాన్సుంటుంది. అదే సమయంలో విలియమ్సన్ ఫిట్​నెస్​ సాధించలేక కొన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు దూరమైతే ప్రారంభంలోనే జట్టుపై అది పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక వార్నర్ లాంటి విధ్వంసకర ఓపెనర్​ను వదులుకున్న రైజర్స్​.. అతడి స్థానంలో పూరన్, రాహుల్ త్రిపాఠి లాంటి హిట్టింగ్ బ్యాటర్లను తీసుకుంది. పూరన్ ఫామ్ లోనే కనిపిస్తున్నా.. త్రిపాఠి విఫలమైతే కష్టమే. మిడిలార్డర్ లో అభిషేక్, సమద్, గార్గ్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లపై నమ్మకం ఉంచలేం. 

ఎవరితో ఎన్ని మ్యాచ్ లు 
గ్రూప్-బిలో ఉన్న సన్ రైజర్స్ అదే గ్రూప్ లోని చెన్నై, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ తో పాటు 
గ్రూప్-ఎలోని కోల్ కతాతో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, లక్నోలతో ఒక్కో మ్యాచ్ లో తలపడుతుంది.

సన్​ రైజర్స్​ టీమ్
ఇండియన్స్: రాహుల్ త్రిపాఠి, జగదీశ్ సుచిత్, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, నటరాజన్, భువనేశ్వర్, అబ్దుల్​ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్,  ప్రియమ్ గార్గ్, విష్ణు వినోద్, ఉమ్రన్ మాలిక్, శశాంక్ సింగ్, ఆర్​. సమర్థ్, సౌరభ్ దూబే,
ఫారిన్‌‌‌‌ ప్లేయర్లు: విలియమ్సన్ (కెప్టెన్), మార్‌‌‌‌క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్, ఫజల్ ఫరూకి, మార్కో జాన్సెన్, సీన్ అబాట్

బెస్ట్ పెర్ఫామెన్స్: 2016 విన్నర్
2021 సీజన్​లో: చివరి ప్లేస్