IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకి ఊహించని షాక్ తాకింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించి, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో చెన్నై ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమితో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోవడమే కాకుండా, తమ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత కఠినతరం చేసుకుంది.
జట్టు ఎంపికలో తప్పిదాలు:
కీలకమైన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. గాయపడిన జేమీ ఓవర్టన్ స్థానంలో స్పెన్సర్ జాన్సన్‌ను టీమ్ లోకి తీసుకున్నారు. కానీ లక్నో పిచ్ పరిస్థితుల దృష్ట్యా అద్భుతమైన ఫాంలో ఉన్న స్పిన్నర్ అకీల్ హుసేన్ ని పక్కన పెట్టడం మైనస్‌గా మారింది. మరో స్పిన్నర్ నూర్ అహ్మద్ ఒకవైపు రన్స్ ని కట్టడి చేసినా, అతనికి తోడుగా అకీల్ హుసేన్ ఉండి ఉంటే (కనీసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా) లక్నో బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉండేది.
అన్షుల్ కాంబోజ్ చెత్త రికార్డు!:
ఈ సీజన్‌లో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసి, పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న అన్షుల్ కాంబోజ్ కి లక్నోతో జరిగిన మ్యాచ్ ఒక పీడకలగా మిగిలిపోయింది. LSG బ్యాటర్లు అతడిని పూర్తిగా టార్గెట్ చేశారు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన కాంబోజ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఏకంగా 4 సిక్సర్లు కొట్టాడు. అలాగే 17వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కాంబోజ్‌ను నికోలస్ పూరన్ ఓ ఆట ఆడుకున్నాడు. మొదటి 4 బంతుల్లోనే 4 సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను కంప్లీట్ చేసేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో, రెండు వేర్వేరు ఓవర్లలో నాలుగేసి సిక్సర్లు (మొత్తం 8 సిక్సర్లు) సమర్పించుకున్న ఏకైక బౌలర్‌గా కాంబోజ్ చెత్త రికార్డుని మూటగట్టుకున్నాడు. కేవలం 2.4 ఓవర్లలోనే 63 రన్స్ సమర్పించి సీఎస్కే ఓటమికి కారణమయ్యాడు.
సీఎస్కే ప్లేఆఫ్స్ సమీకరణాలు:
ప్రస్తుతం 12 మ్యాచులు ఆడిన చెన్నై 6 విజయాలు, 6 ఓటములతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై ఇంకా 2 లీగ్ మ్యాచులు ఆడాల్సి ఉంది. మే 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రసవత్తర పోరు ఉండగా.. మే 21: గుజరాత్ టైటాన్స్ (GT)తో చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతుంది.
సీఎస్కే ప్లేఆఫ్స్ చేరాలంటే?:
చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా ఈ రెండు మ్యాచుల్లోనూ భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. అలా గెలిచినా కూడా ఇతర జట్ల (ముఖ్యంగా టాప్-4 రేసులో ఉన్న జట్ల) గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయినట్లే!.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
