
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీలో తనకు ఎదురైన ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. అవి యాదృచ్ఛికంగా జరిగినవి కావని ఉద్దేశపూర్వక కుట్ర, అవమానమైనవని పేర్కొన్నారు. వాటిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని సీక్రెట్ సర్వీస్‌కు ఆదేశించారు. వీటి వెనక ఎంత పెద్ద వారున్నా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అలాగే దీనిపై యూఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెర్రెస్‌కు లెటర్ రాస్తానని ప్రకటించారు.
ఈ మేరకు తన ట్రూత్ సోషల్ అకౌంట్లో ట్రంప్ పోస్టు చేశారు. మంగళవారం ట్రంప్ తన సతీమణి మెలానియా, అమెరికా ఉన్నతాధికారులతో కలిసి యూఎన్‌కు వెళ్లినపుడు వారు ఎక్కిన ఎస్కలేటర్ ఆగిపోయింది. దానిపై ఉన్న వారంతా పడిపోయే పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత యూఎన్‌లో ప్రసంగిస్తుంటే టెలిప్రాంప్టర్ ఒక్కసారిగా ఆగిపోయి స్క్రీన్ బ్లాక్ అయింది. తర్వాత సౌండ్ సిస్టమ్ ఫెయిల్అవడంతో ఆయన మాట్లాడింది అక్కడున్న వారికి స్పష్టంగా వినిపించలేదు.
ప్రసంగం తర్వాత ట్రంప్ మెలానియా వైపు చూడగా తనకేమీ వినిపించలేదని ఎక్స్ ప్రెషన్స్ద్వారా ఆమె వెల్లడించారు. వీటిపై ట్రంప్ అక్కడే అసహనం వ్యక్తం చేశారు. ‘‘మూడు సినిస్టర్ ఈవెంట్స్, రియల్ డిస్‌గ్రేస్!’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్‌చేశారు. అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ సెక్యూరిటీ టేప్‌లను సేవ్చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం యూఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాతో మాట్లాడుతూ ఎస్కలేటర్ ఆగిపోవడానికి పొరపాటుగా సేఫ్టీ ఫంక్షన్ ట్రిగ్గర్ అవడమే కారణమని చెప్పారు. అయితే ట్రంప్ ఈ వివరణను తిరస్కరించారు. కాగా, ఆ మూడు ఘటనలు ఉద్దేశపూర్వకంగా జరిగితే బాధ్యులను డిస్మిస్ చేయాలని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.