దసరా పండుగకు ఆ మూడు గ్రామాలు దూరం

దసరా పండుగకు ఆ మూడు గ్రామాలు దూరం

మరికల్, వెలుగు  :  ఇథనాల్ ఫ్యాక్టరీ రగిల్చిన చిచ్చుతో నారాయణపేట జిల్లా మరికల్​మండలంలో మూడు గ్రామాల ప్రజలు దసరా పండుగకు దూరమయ్యారు. పోలీసుల భయంతో ఊళ్లోకి కొత్త వారు ఎవరూ రావడం లేదు. అలాగే గ్రామస్తుల చుట్టాలు, తోబుట్టువులు కూడా కన్నెత్తి చూడడంలేదు. ఎలాంటి వేడుకలు లేకుండా నిర్మానుష్యమై కనిపించాయి. మరికల్ మండలం ఎక్లాస్​పూర్​ స్టేజీ వద్ద ఆదివారం ఉదయం ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చిత్తనూరు, ఎక్లాస్​పూర్, జిన్నారం గ్రామ ప్రజలు ఆందోళన చేశారు. 

ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో  పలువురు గాయపడ్డారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రజలు పోలీసులపై ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసు అధికారులతో పాటు సిబ్బంది  గాయపడ్డారు. ఈ సందర్భంగా కొన్ని పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో పోలీసులు అదే రోజు మధ్యాహ్నం నుంచి మూడు గ్రామాల్లోని ప్రజలపై నిఘా పెట్టారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్​ చేయగా ఇంకొందరి కోసం గాలిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆయా గ్రామాల్లో పోలీస్ పికెటింగ్​ నిర్వహిస్తున్నారు. 

దీంతో సోమవారం మూడు ఊళ్లల్లో ప్రజలెవరు దసరా పండుగను జరుపుకోలేదు. ఊళ్లలోని ఆలయాలు భక్తులు లేక వెలవెలబోయాయి. ఎప్పుడేమవుతుందోనని మూడు గ్రామాలకు చెందిన చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఊళ్లో కేవలం కొంతమంది వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. చాలా ఇండ్లకు తాళాలేసి ఉన్నాయి. పోలీసులు ఎప్పుడొచ్చి ఎవరిని పట్టుకెళ్తారోనని ఉన్నవారెవరూ ఇండ్ల నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఎవరైనా బయటి నుంచి ఊళ్లకు వస్తే వారిని విచారించిన తర్వాతే పోలీసులు లోపలకు పంపిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పోలీసుల పికెటింగ్​ కొనసాగుతూనే ఉంది.

14 మందిపై కేసు నమోదు

పోలీసులపై దాడి ఘటనను ఉన్నతాధికారులు సీరియస్​గా తీసుకున్నారు. సోమవారం మరికల్ పోలీస్ స్టేషన్​ను ఐజీ షానవాజ్​ ఖాసీం, డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ సందర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలడిగి తెలుసుకున్నారు. గాయపడిన మక్తల్ సీఐ రాంలాల్​తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్స్​ను పరామర్శించారు. ఘటనకు కారకులైన 14 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు మరికల్ ఎస్ఐ హరిప్రసాద్​రెడ్డి తెలిపారు. మరికొంత మందిపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల వెంట నారాయణపేట ఎస్పీ యోగేశ్​ గౌతం ఉన్నారు.