వెయ్యి మిస్సింగ్​ కేసులు ఛేదించిన ‘ఒకే ఒక్కడు’

వెయ్యి మిస్సింగ్​ కేసులు ఛేదించిన ‘ఒకే ఒక్కడు’

 ఓటమెరుగని ఖాకీ..

ఒక్కటి తప్ప అన్నికేసులూ సక్సెస్

ఒకటా.. రెండా.. వెయ్యి మిస్సింగ్​ కేసులు.. ఫెయిల్యూర్​ అన్న మాట ఎరుగడు. చేసిన ప్రతి మిషన్​ సక్సెస్​. అందుకే ఆ పోలీస్​ను ముంబై షెర్లాక్​ హోమ్స్​ అంటున్నారు. మిస్సింగ్​ కేసు వచ్చిందంటే ముంబై పోలీసులకు కనపడే వ్యక్తి, వినపడే పేరు హెడ్​కానిస్టేబుల్​ రాజేశ్​ పాండే. అవును మరి, 2005 నుంచి ఇప్పటిదాకా ఆయన వెయ్యి మిస్సింగ్​ కేసులను పరిష్కరించారు. ఒక్క కేసు తప్ప మిగతా అందరినీ తమ తమ ఇళ్లకు పంపించేలా చూశారు. చెప్పాలంటే ఆయన కథ ఆధారంగా ఓ సినిమానే తీసేయొచ్చంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే బాలీవుడ్​ డైరెక్టర్​ సినిమా తీసేందుకు ముందుకొచ్చాడు. పోలీసుల పర్మిషన్​ తీసుకున్నాడు.

అబ్బాయి మిస్సింగ్​ కేసుతో స్టార్ట్​

2011లో ఓ అబ్బాయి మిస్సింగ్​ కేసుతో స్టార్ట్​ అయింది రాజేశ్​ పాండే సక్సెస్​. తన సొంత తండ్రి చేతిలోనే (భార్య నుంచి విడిపోయాక) కిడ్నాప్​ అయిన అబ్బాయిని రక్షించారు రాజేశ్​ పాండే. ఆ కేసును పరిష్కరించేందుకు ఎన్నో ప్రయాసలు పడ్డారు. తన స్కిల్స్​ అన్నీ వాడి ఆ అబ్బాయి జాడ కనుక్కున్నారు. ఇక, అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకున్న సందర్భాలు అరుదు. ‘‘వేరే నేరాలతో పోలిస్తే మిస్సింగ్​ పర్సన్స్​ కేసులను పరిష్కరించడం, ప్రత్యేకించి పిల్లలను కాపాడడమే నాకు ముఖ్యం” అని రాజేశ్​ పాండే చెబుతారు. ఆయన పనితనం నచ్చి ముంబై రిటైర్డ్​ పోలీస్​ కమిషనర్​ దత్త పాదసాల్గికర్​, ‘పాండే మాడ్యూల్​’ను పెట్టారు. అంటే, మిస్సింగ్​ కేసులను విచారించే ఏ అధికారి అయినా ఆయన ఫాలో అయ్యే పద్ధతులను పాటించడం దాని ఉద్దేశం.

కొరియర్​బాయ్​గా వేషం

కేసులను సాల్వ్​ చేసేందుకు రాజేశ్​ పాండే అందరితోనూ పరిచయాలు పెంచుకుంటారు. స్థానికంగా ఉండే దర్జీలు, గెస్ట్​హౌస్​ ఓనర్లు, బార్​ ఉద్యోగులతో పరిచయాలు ఉంటాయి. 2014లో ఓ ఇంట్లో పనిచేసే అమ్మాయి మిస్సింగ్​ కేసును కొరియర్​బాయ్​గా వేషం కట్టి పరిష్కరించారు ఆయన. ఆ అమ్మాయి మిస్సయ్యాక ఏ ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే, ఓ రోజు సడన్​గా ఆ అమ్మాయి తను పనిచేసే యజమానులకు ఫోన్​ చేసింది. ఆమె ఫోన్​ చేసిన నంబర్​ ఆధారంగా పశ్చిమబెంగాల్​లోని 24 పరగణాస్​లో ఉన్నట్టు గుర్తించారు. ఆ నంబర్  రిజిస్టర్​ అయిన అడ్రస్​కు వెళ్లారు. అయితే, తప్పుడు అడ్రస్​ పెట్టి ఆ నంబర్​ తీసుకున్నట్టు గుర్తించారు. వెంటనే ఓ ఆలోచన చేశారు రాజేశ్​ పాండే. ఆ అమ్మాయి యజమానులను కలిశారు. ఆ అమ్మాయి ఫోన్​ చేసిన నంబర్​కు మళ్లీ ఫోన్​ చేయించారు. కొరియర్​ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. ఓ కొరియర్​ వచ్చింది. పూర్తి అడ్రస్​ కావాలని ఆ ఫోన్​ లిఫ్ట్​ చేసిన వ్యక్తికి చెప్పించారు. వెంటనే ఆ వ్యక్తి అడ్రస్​ ఇచ్చాడు. రాజేశ్​ పాండే కొరియర్​ బాయ్​గా వేషం కట్టి ఆ అడ్రస్​కు వెళ్లారు. ఆ అమ్మాయికి బలవంతపు పెళ్లి చేస్తున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే అమ్మాయిని రక్షించారు. 26 ఏళ్ల కెరీర్​లో ఇలాంటి ఎన్నో కష్టమైన కేసులను ఆయన పరిష్కరించి తోటి పోలీసులకు స్ఫూర్తిగా నిలిచారు. తన కమ్యూనికేషన్​ స్కిల్స్​, సోషల్​ నాలెడ్జ్​ను వాడుకుని కేసులను పరిష్కరించగలిగానని రాజేశ్​ పాండే చెబుతారు.