క్వీన్ అంతిమయాత్రకు వేలాది మంది ప్రముఖుల హాజరు

క్వీన్ అంతిమయాత్రకు వేలాది మంది ప్రముఖుల హాజరు

క్వీన్ ఎలిజబెత్ -అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. క్వీన్ అంతిమ సంస్కారం కోసం అక్కడి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలిజబెత్ ఆఖరి చూపుల కోసం వివిధ దేశాధినేతలు తరలివచ్చి నివాళులర్పించారు. వందల ఏండ్ల నాటి రాచరిక సంప్రదాయాల ప్రకారం క్వీన్కు తుది వీడ్కోలు పలుకుతున్నారు. అంతిమయాత్రలో వేలాది మంది పౌరులు పాల్గొంటున్నారు. రాణి అంత్యక్రియల సందర్భంగా బ్రిటన్లో సెలవు ప్రకటించారు. 96 ఏండ్ల క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న స్కాట్లాండ్లో కన్నుమూశారు. 

వెస్ట్ మినిస్టర్  హాల్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబే వరకు క్వీన్ అంతిమయాత్ర  నిర్వహించిన అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. అక్కడ నుంచి వెల్లింగ్టన్ అర్చి వరకూ అంతిమయాత్ర సాగింది. అక్కడి నుంచి విండ్సర్స్  క్యాజిల్లోని సెయింట్ జార్జ్  చాపెల్కు రాణి శవపేటికను అంతిమయాత్రగా తీసుకెళ్లారు. కింగ్  జార్జ్  6 మెమోరియల్ చాపెల్లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్ వాల్ట్ లో క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్  ఫిలిప్ ను ఉంచిన చోటనే రాణి శవపేటికను ఉంచనున్నారు. రాజ కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే రాణిని ఖననం చేయనున్నారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత హాజరైన వారంతా 2 నిమిషాల పాటు మౌనం పాటించనున్నారు.

వెస్ట్ మినిస్టర్  హాల్ లో ఉంచిన ఎలిజబెత్ -2 పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఆయన భార్య జిల్  బైడెన్  నివాళులర్పించారు. అంతకు ముందు లాంకస్టెర్  హౌస్ లో రాణి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన సంతాప సందేశం పుస్తకంలో రాష్ట్రపతి ముర్ము సంతకం చేశారు. వెస్ట్ మిన్ స్టర్ అబేలో జరిగే క్వీన్ అంత్యక్రియల కోసం ప్రపంచ వ్యాప్తంగా 2 వేల మంది ప్రముఖులు అటెండయ్యారు. రాజు చార్లెస్ 3  తో పాటు వివిధ రాజ కుటుంబాలు హాజరయ్యారు. పలు దేశాధినేతలు సహా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 800 మంది అతిథులు సెయింట్  చాపెల్ లోని విండ్సర్  క్యాజిల్  దగ్గర నివాళులర్పించనున్నారు.

క్వీన్ అంత్యక్రియలను ప్రసారం చేసేందుకు 125 సినిమా థియేటర్లను తెరిచే ఉంచారు. క్వీన్ అంత్యక్రియలను లండన్  సహా బ్రిటన్ వ్యాప్తంగా పార్కులు, వివిధ ప్రదేశాల్లో భారీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అంత్యక్రియలకు AJ ప్లస్ అనే మీడియా 9  మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తోంది. 2 వేల 868 వజ్రాలు, 17 నీలమణులు, 11 పచ్చలు, 269 ముత్యాలు, 4 కెంపులతో కూడిన కిరీటాన్ని క్వీన్  శవపేటికపై అలంకరించారు.