జీతాలు సరిగ్గా ఇవ్వలేని కేసీఆర్​కు వేలకోట్లు..ఎక్కడి నుంచి వచ్చినయ్​ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

జీతాలు సరిగ్గా ఇవ్వలేని కేసీఆర్​కు వేలకోట్లు..ఎక్కడి నుంచి వచ్చినయ్​ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పిట్లం, వెలుగు : రాష్ట్రంలో 13వ తేదీన కూడా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, అలాంటిది కేసీఆర్ కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఈడీ, సీబీఐ, సుప్రీం కోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్​ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బీఎస్పీ కార్యకర్తల మీటింగ్ పిట్లం మండల కేంద్రంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘పదో తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని విద్యాశాఖ మంత్రి మనకు అవసరమా?”అని ప్రవీణ్​కుమార్ తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమైన మొదటి రోజే వికారాబాద్ జిల్లాలో తెలుగు పేపర్, రెండో రోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీకైనట్లు చెబుతున్నారన్నారు. 

ఫైనాన్స్ చేసేంత డబ్బు ఎక్కడిది?

ప్రతిపక్ష పార్టీల కూటమికి చైర్​పర్సన్​ను చేస్తే.. 2024 ఎన్నికల ప్రచారానికి ఫైనాన్స్ చేస్తానని కేసీఆర్ ప్రకటించారంటే.. తెలంగాణను ఏ రీతిలో దోచుకున్నారో అర్థం అవుతుందని ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ ఆరోపించారు. ఈ డబ్బంతా ఎక్కడ దాచారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతీ నెలా పింఛన్ రావడం లేదని, పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కవిత లిక్కర్​స్కామ్​లో కనిపించిన రూ.100 కోట్లు సముద్రంలో ఒక నీటి చుక్కలాంటిదన్నారు.

స్కీములన్నీ స్కామ్​లుగా మారిపోయాయని విమర్శించారు. కేంద్రంలో అదానీతో మోడీ ఎలా అయితే దేశ సంపదను దోచుకున్నారో.. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ అలాగే దోచుకుందని 
ఆరోపించారు. రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్, లిక్కర్ స్కామ్, పేపర్ స్కామ్స్ నడుస్తున్నాయన్నారు. టీఎస్​పీఎస్సీలో క్వశ్చన్​ పేపర్లను రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల దాకా అమ్ముకున్నారని ఆరోపించారు.