హమాస్‌‌ను సపోర్ట్ చేస్తే అరెస్ట్ అయితరు

హమాస్‌‌ను సపోర్ట్ చేస్తే అరెస్ట్ అయితరు
  • హమాస్‌‌ను సపోర్ట్ చేస్తే అరెస్ట్ అయితరు
  •  లండన్‌‌లో ప్రో పాలస్తీనా
  • ప్రొటెస్టర్లకు పోలీసుల హెచ్చరికలు

లండన్: గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా బ్రిటన్‌‌లోని లండన్‌‌లో వేలాది మంది ప్రో పాలస్తీనా మద్దతుదారులు ర్యాలీలు తీశారు. పెద్దలు, పిల్లలు సహా వందలాది మంది ‘గాజాపై బాంబులేయడం ఆపండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. పాలస్తీనా జెండాలను చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వారికి లండన్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

 హమాస్‌‌కు ఎవరైనా మద్దతు ప్రకటించినా.. ర్యాలీ సందర్భంగా రూట్ మార్చి వెళ్లినా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ర్యాలీలకు బందోబస్తు కల్పించేందుకు వెయ్యి మందికిపైగా అధికారులను రంగంలోకి దించామని మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ తెలిపింది. పాలస్తీనా జెండాను ఎగురవేయడం, లేదా పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలపడం ఎలాంటి తప్పు కాదని చెప్పింది. అయితే ఏదైనా జెండా లేదా బ్యానర్.. రెచ్చగొట్టేలా, బాధ కలిగించేలా ఉంటే నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. 

కోల్‌‌కతాలో ప్రో పాలస్తీనా ర్యాలీ

గాజా ప్రజలకు సంఘీభావంగా బెంగాల్‌‌లోని కోల్‌‌కతాలో ప్రో పాలస్తీనా ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టుకుని, నినాదాలు చేస్తూ ముస్లింలు ర్యాలీ చేశారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంపస్‌‌లోనూ విద్యార్థులు ప్రో పాలస్తీనా నినాదాలు చేశారు. ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసి ఉన్న బ్యాడ్జిలు ధరించారు. అయితే నిరసన ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదంటూ అధికారులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్లు సెంట్రల్ యూనివర్సిటీలో పాలస్తీనాకు సంఘీభావంగా నిరసనలు చేపట్టాయి.