హైదరాబాద్‌‌‌‌ లో ‘థ్రెడ్‌‌‌‌ పోచంపల్లి’ ...ఇవాళ్టి(జూన్ 05) నుంచి 7 వరకు హైటెక్స్‌‌‌‌లో చేనేత ఎగ్జిబిషన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌ లో  ‘థ్రెడ్‌‌‌‌ పోచంపల్లి’ ...ఇవాళ్టి(జూన్ 05) నుంచి  7 వరకు హైటెక్స్‌‌‌‌లో చేనేత ఎగ్జిబిషన్‌‌‌‌
  • ప్రత్యేక ఆకర్షణగా పోచంపల్లి ఇక్కత్‌‌‌‌, పుట్టపాక తేలియా రుమాల్‌‌‌‌
  • వంద స్టాల్స్‌‌‌‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన

యాదాద్రి, వెలుగు :  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్‌‌‌‌, పుట్టపాక తేలియా రుమాల్‌‌‌‌ వంటి తెలంగాణ చేనేత వస్త్రాలకు మరింత మార్కెటింగ్‌‌‌‌ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌‌‌‌లో ‘థ్రెడ్–పోచంపల్లి’ పేరిట భారీ ఎగ్జిబిషన్‌‌‌‌ నిర్వహించనున్నారు. హైటెక్స్‌‌‌‌ వేదికగా ఇయ్యాల ప్రారంభం అయ్యే ఈ చేనేత మహోత్సవంలో మూడు రోజుల పాటు వందలాది ప్రత్యేక ఉత్పత్తులు, సరికొత్త డిజైన్లు, పద్మశ్రీ అవార్డు గ్రహీతల కళాఖండాలు ప్రదర్శించనున్నారు. చేనేత కళాకారులకు మెరుగైన మార్కెటింగ్‌‌‌‌ అవకాశాలు కల్పించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఎగ్జిబిషన్​ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఎగ్జిబిషన్‌‌‌‌ను తిలకించేందుకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో సహా పలువురు మంత్రులను ఆహ్వానించారు.

చేనేత ఉత్పత్తుల కోసం 100 స్టాల్స్‌‌‌‌

పోచంపల్లి ఇక్కత్‌‌‌‌ వస్త్రాలు, పుట్టపాక తేలియా రూమాళ్లు ఎంత పేరు పొందినప్పటికీ మార్కెటింగ్‌‌‌‌లో మాత్రం వెనుకంజలో ఉన్నాయి. ఈ ఉత్పత్తులకు డూప్లికేట్‌‌‌‌ తయారు చేసి తక్కువ ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన యాదాద్రి కలెక్టర్‌‌‌‌ అనురాగ్‌‌‌‌ జయంతి చేనేత కళాకారులు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్‌‌‌‌ పెంచి వారి జీవన ప్రమాణాలు పెంపొందించేలా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఎగ్జిబిషన్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. 

ఇందులో వివిధ రకాల చేనేత ఉత్పత్తులను ప్రదర్శించడానికి 100 స్టాల్స్‌‌‌‌ ఏర్పాటు చేశారు. ‘ఇక్కత్‌‌‌‌’ వస్త్రాలు, తేలియా రుమాళ్లతో పాటు వివిధ రకాల డ్రెస్‌‌‌‌ మెటీరియల్స్‌‌‌‌ను ప్రదర్శించనున్నారు. వీరితో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలైన ఆలేరు మండలం శారాజీపేటకు చెందిన చింతకింది మల్లేశం, సంస్థాన్‌‌‌‌నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గజం గోవర్దన్‌‌‌‌, గజం అంజయ్య రూపొందించిన ఉత్పత్తులను సైతం ప్రదర్శించనున్నారు. మరో 20 స్టాల్స్‌‌‌‌ మహిళా సంఘాలకు కేటాయించగా.. తాము రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు.

‘ఇక్కత్‌‌‌‌’ మార్కెటింగ్‌‌‌‌ పెంచేందుకే...

పోచంపల్లి ఇక్కత్‌‌‌‌, పుట్టపాక తేలియా రుమాల్‌‌‌‌కు విస్తృతమైన మార్కెటింగ్‌‌‌‌ లేదు. ఈ కారణంతో చేనేత కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడం లేదు. కళతోనే కాకుండా... ఉత్పత్తులకు మార్కెటింగ్‌‌‌‌ కల్పించినప్పుడే వారి జీవన స్థితులు మెరుగుపడతాయి. ఇందుకోసమే ‘థ్రెడ్‌‌‌‌ పోచంపల్లి’ పేరుతో హైదరాబాద్‌‌‌‌ ప్రజలు, టూరిస్ట్‌‌‌‌లను ఆకర్షించేందుకు ఎగ్జిబిషన్‌‌‌‌ నిర్వహిస్తున్నాం.  

– అనురాగ్‌‌‌‌ జయంతి, యాదాద్రి కలెక్టర్‌‌‌‌