నిందితులు, ఎమ్మెల్యేల మధ్య మూడున్నర గంటల చర్చ

నిందితులు, ఎమ్మెల్యేల మధ్య మూడున్నర గంటల చర్చ

రిమాండ్ రిపోర్టులో పోలీసుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులు, ఎమ్మెల్యేల మధ్య దాదాపు మూడున్నర గంటల పాటు చర్చ జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుల రిమాండ్ కు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు.. దానికి 39 పేజీల రిమాండ్ రిపోర్టును జత చేశారు. అందులో నిందితులను ఎలా ట్రాప్ చేశామనేది వివరించారు. ఆపరేషన్ లో నాలుగు సీక్రెట్ కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు ఉపయోగించినట్లు తెలిపారు. ఉదయం 11:30 గంటలకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తమకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ‘‘ఫామ్ హౌస్ లోని హాల్ లో మధ్యాహ్నం 3:05 గంటలకు సీక్రెట్ కెమెరాలు ఆన్ చేశాం. 3:10 గంటలకు నిందితులతో కలిసి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చారు. రోహిత్ రెడ్డి తన కుర్తా పైజామాలో రెండు వాయిస్ రికార్డర్లు పెట్టుకున్నారు. 4:10 గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతరావు ఫామ్ హౌస్ హాల్ లోకి చేరుకున్నారు. వీళ్లందరూ వచ్చే కంటే ముందే మేం వెళ్లాం. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అంటూ సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి ముందే చెప్పాం. రోహిత్ రెడ్డి సిగ్నల్ ఇవ్వగానే మీటింగ్ హాల్ లోకి వెళ్లాం” అని పోలీసులు వెల్లడించారు. 

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు... 

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామన్నట్లు వాయిస్ రికార్డర్లలో రికార్డ్ అయిందని పోలీసులు పేర్కొన్నారు. ‘‘కర్నాటక, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లోనూ ఇలానే చేశామని రామచంద్ర భారతి చెప్పినట్లుగా రికార్డయింది. తుషార్ కు రామచంద్ర భారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డ్ ఉంది. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ బన్సల్ కు రామచంద్రభారతి ఎస్ఎంఎస్ పంపారు” అని తెలిపారు. ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ నూ నివేదికలో పొందుపరిచినట్లు చెప్పారు. రామచంద్ర భారతి, నందకుమార్ వాట్సాప్ చాటింగ్​ల స్క్రీన్ షాట్స్ సేకరించినట్లు వెల్లడించారు. ‘‘25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ‘‘సంతోష్ బీజేపీ” పేరుతో ఉన్న నెంబర్ కు రామచంద్ర భారతి వాట్సాప్ మెసేజ్ చేశారు. నందకుమార్ డైరీలో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయి. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు ఫామ్ హౌస్ కి వచ్చారు” అని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.