అన్నతో గొడవ.. అడ్డొచ్చిన తమ్ముడు మర్డర్: టోలిచౌకి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

అన్నతో గొడవ.. అడ్డొచ్చిన తమ్ముడు మర్డర్: టోలిచౌకి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: టోలిచౌకిలో వ్యక్తిని హత్య చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. భార్యపై సమాజంలో చెడుగా చెబుతూ పరువు తీస్తున్నాడన్న కోపంలో ఓ వ్యక్తిని చంపేందుకు మరో వ్యక్తి ప్లాన్​ వేశాడు. టార్గెట్​చేసిన వ్యక్తిని చంపే క్రమంలో అడ్డుకున్న తమ్ముడిని హత్య చేశాడు. టోలిచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ వివరాలను వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన షేక్ బిలాల్ ఆటో డ్రైవర్. తన భార్య సనా బేగంపై హకీం షా కాలనీ విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అద్నాన్ తప్పుడు ఆరోపణలు చేసి సమాజంలో చెడ్డ పేరు తెస్తున్నాడని కోపం పెంచుకున్నాడు. 

అద్నాన్​ను చంపేందుకు బావమరిది నవీద్ తో కలిసి బిలాల్​ ప్లాన్​ వేశాడు. వీరిద్దరు ఓ కత్తిని కొన్నారు. ఆదివారం రాత్రి వీరిద్దరితో పాటు బిలాల్ భార్య సనా బేగం, బంధువు రోహి బేగం కలిసి అద్నాన్​ ఇంటికి వెళ్లి గొడవ చేశారు. ఆ సమయంలో అద్నాన్ పారమౌంట్​  కాలనీలో ఉండడంతో అక్కడికి వెళ్లారు. ఇరువురి మధ్య గొడవ జరుగుతోంది. విషయం తెలుసుకున్న అద్నాన్​ తమ్ముడు ఇర్ఫాన్  అక్కడికి వెళ్లాడు. గొడవలో బిలాల్ కత్తితో ఇర్ఫాన్​ ఛాతిలో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో బిలాల్, సనా బేగం, రోహిబేగంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నవీద్ పరారీలో ఉన్నాడు.