మూడు రాజధానులు మంచిది కాదు: రాహుల్

 మూడు రాజధానులు మంచిది కాదు: రాహుల్
  • అమరావతికి భూములు ఇచ్చినోళ్లకు అండగా ఉంటం 
  • అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేస్తం
  • అధికారంలోకొస్తే విభజన హామీలన్నీ అమలు చేస్తమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: ఏపీలో మూడు రాజధానులు ఉండాలన్న ఆలోచన మంచిది కాదని, రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని రాహుల్ అన్నారు. ‘‘నేను నిన్న రాజధాని కోసం భూములిచ్చినోళ్లను కలిశాను. వాళ్లు మోసపోయారు. వాళ్లకు న్యాయం జరగాలి. మేం అండగా ఉంటాం. వాళ్ల హక్కులను కాపాడతాం’’ అని చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, తన పాదయాత్రలో ఆ విషయం గమనించానని తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ కు ఆదరణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలను తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. పోలవరం నిర్మాణం, ప్రత్యేక హోదా లాంటి అత్యంత కీలకమైన హామీలను అమలు చేయాలి. మేం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని తెలిపారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

పొత్తులపై పీసీసీలదే నిర్ణయం..

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నీటి వివాదాలను ఎలా పరిష్కరిస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆ ప్రక్రియను చూసేందుకు చట్టపరమైన వ్యవస్థలు ఉన్నాయి. సమస్యలను వాళ్లు పరిష్కరిస్తారు. మేం కేవలం పోలవరం పూర్తి చేసే విషయంలో మాత్రం కట్టుబడి ఉంటాం” అని రాహుల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని మీడియా ప్రశ్నించగా.. ‘‘దానిపై స్థానిక నేతలు నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు వచ్చారు. కాబట్టి కీలకమైన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు. నేను కూడా అధ్యక్షుడు చెప్పినట్లే నడుచుకోవాల్సి ఉంటుంది” అని తెలిపారు.