ఇరిగేషన్​లో సడెన్​గా ముగ్గురు సీఈల వీఆర్ఎస్​

ఇరిగేషన్​లో సడెన్​గా ముగ్గురు సీఈల వీఆర్ఎస్​
  • స్పెషల్​ సీఎస్​ రజత్ ​కుమార్​ఉత్తర్వులు జారీ 
  • బలవంతంగా పదవీ విరమణ చేయించారంటూ విమర్శలు
  • ఇంకో ఇద్దరికి రంగం సిద్ధం

హైదరాబాద్​, వెలుగు: నీటిపారుదల శాఖలో ముగ్గురు చీఫ్ ఇంజినీర్ (సీఈ) స్థాయి అధికారులు వీఆర్ఎస్​ తీసుకున్నారు. దీంతో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో భారీ కుదుపు చోటు చేసుకున్నది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసినవారిలో ఒక చీఫ్ ఇంజినీర్ ఓఅండ్​ఎం విభాగంలో పనిచేస్తుండగా, మరొకరు హైడ్రాలజీలో, ఇంకొకరు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎల్డీవో)లో  పనిచేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ జీవో ఎంఎస్ నెం 24, 25, 26ను జారీ చేశారు. అయితే  రాష్ట్ర ప్రభు త్వమే ఈ ముగ్గురిని బలవంతంగా పదవీ విరమణ చేయించిందనే విమర్శలు వస్తున్నాయి. గత కొన్నినెలలుగా ముగ్గురు సీఈలపై ప్రభుత్వం గుర్రుగా ఉంది.  ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకోకపోవడంతోనే బలవంతంగా వీఆర్ఎస్​ ఇప్పించినట్లు తెలిసింది. ముగ్గురు సీఈలను పిలిపించి వార్నింగ్ ఇవ్వడంతో ఇద్దరు సీఈలు వీఆర్ఎస్​కు దరఖాస్తు చేసుకున్నారు.  

ఇంకో సీఈ అందుకు నిరాకరించడంతో ఆయనను తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్​-1990లోని రూల్-44(1)(బి) ద్వారా బలవంతంగా పదవీ విరమణ చేయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ముగ్గురు ఈ నెల 31వ తేదీ నుంచి పదవీ విరమణ చేసినట్లు పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశిస్తూ ప్రభుత్వం  జీవోలో పేర్కొన్నది.  ఆ వెంటనే నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ల జాబితా నుంచి ముగ్గురి పేర్లను తొలగిస్తూ యుద్ధప్రాతిపదికన అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 25 మంది చీఫ్ ఇంజినీర్లు ఉండగా వారిలో ముగ్గురి 
పేర్లను తొలగించారు.

త్వరలో మరో ఇద్దరు ఎస్ఈల వీఆర్ఎస్​

మరో ఇద్దరు ఎస్ఈ(సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్లు) కూడా వీఆర్ఎస్​ తీసుకునేలా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఒక స్థాయిలో వారికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఆరోగ్య కారణాలతో నల్గొండ చీఫ్ ఇంజినీర్(సీఈ) గా పనిచేస్తున్న శ్రీకాంత రావు పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా.. ప్రభుత్వం చాలాకాలం ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. 59 ఏండ్లు నిండుతున్న క్రమంలో ఆయన విజ్ఞప్తిని మన్నించింది. హైదరాబాద్ శివారు జిల్లాలో పనిచేస్తున్న సీఈ కూడా వీఆర్​ఎస్​కు అప్లై చేసుకుంటే ఆయన్ను నచ్చచెప్పి వీఆర్ఎస్ పత్రం వెనక్కి తీసుకునేలా చేసింది. ఇప్పుడు అలా కాకుండా కొందరిని ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి, ఒత్తిడి చేసి వీఆర్ఎస్​ ఇప్పిస్తున్నారని ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో పెద్ద చర్చ జరుగుతు న్నది. ఒక జిల్లాలో పనిచేస్తున్న చీఫ్​ ఇంజినీర్​పై అవినీతి ఆరోపణలు వస్తున్నా ఆయన వైపు కన్నెత్తి చూడటం లేదు. ఆయనతో పాటు మరికొందరినీ పట్టించుకోవడం లేదని, నిజాయతీగా ఉండేవాళ్లకే బలవంతపు వీఆర్​ఎస్​లు ఇప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.