కృష్ణా: సరదాగా ఆడుకోవడానికి పార్క్ చేసి ఉన్న కారులో ఎక్కిన చిన్నారులు ఊపిరాడక మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో ఈ విషాదం చోటుచేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు చిన్నారులు ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలారు. మోహన్ స్పింటెక్స్ కంపెనీ క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాసేపటి క్రితమే కళ్ల ముందు ఆడుకున్న చిన్నారులు అనుకోకుండా మృతి చెందడంపై వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

