
- ప్రత్యేక పూజలు నిర్వహించిన గడ్డం ప్రసాద్, గుత్తా
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులుగా చేపట్టిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజున ఉదయం అమ్మవారికి బంగారు బోనాలు, పట్టువస్త్రాల సమర్పణ, పోతరాజు స్వాగతం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. బోనాలతోపాటు ఒగ్గు డోలు, కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
అనంతరం రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. “ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బోనాలు, బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు. ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆచారం.
సికింద్రాబాద్ ఉజ్జయినీ బోనాలు కూడా వైభవంగా జరుగుతాయి. ఢిల్లీలో లాల్ దర్వాజా కమిటీ సభ్యులు తెలంగాణ ప్రతీకను నిలబెడుతున్నారు” అని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..11 ఏండ్లుగా ఢిల్లీలో బోనాలు నిర్వహిస్తున్న కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం రేవంత్ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. వర్షాలు పడి, పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను” అని చెప్పారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూడాలని ప్రార్థించినట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.