చిదిమేసిన నిద్ర మత్తు.. శ్రీశైలం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చిదిమేసిన నిద్ర మత్తు.. శ్రీశైలం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

కల్వకుర్తి, వెలుగు: దైవ దర్శనం కోసం శ్రీశైలం బయల్దేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కానరాని లోకాలకు తీసుకెళ్లింది. డ్రైవర్​ నిద్రమత్తు కారణంగా వాహనం కల్వర్టును ఢీకొని రెప్పపాటులో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా తలుకుట్టి మండలం కలికిరి(వి) గ్రామానికి చెందిన పది మంది కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి శుక్రవారం రాత్రి తూఫాన్ వాహనంలో దైవదర్శనం కోసం శ్రీశైలం బయల్దేరారు. 

జడ్చర్ల – కోదాడ హైవేపై వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున నాగర్ కర్నూల్​ జిల్లా ఊరుకొండ మండలం తిమ్మనపల్లి దగ్గరికి రాగానే డ్రైవర్‎కు నిద్రమత్తులో స్టీరింగ్​పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ముందు వరుసలో ఉన్న రామ్ రెడ్డి దేశాయ్(50), ఆయన భార్య మేఘనా దేశాయ్(45), బంధువు మహాదేవి(65) స్పాట్​లో మృతిచెందారు. 

డ్రైవర్‎తో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‎కు తీసుకెళ్లారు. మృతుల డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.