ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో ఇండియన్ రెజ్లర్లు మరోసారి పట్టు చూపెట్టారు. అమన్ సెహ్రావత్ గోల్డ్, ఆంటిమ్ పంగల్ సిల్వర్, దీపక్ పూనియా బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన మెన్స్ 57 కేజీల ఫైనల్లో అమన్ 10-7తో వరల్డ్ చాంపియన్ చోంగ్ సాంగ్ హన్ (ఉత్తర కొరియా)పై గెలిచాడు. బౌట్ ఆరంభంలో డిఫెన్స్ వైఖరితో అమన్ నిరాశ చెందాడు. కొరియన్ ఎదురుదాడులను నివారించేందుకు పదేపదే చేతులను బంధించాడు.
అయితే మొదటి స్కోరింగ్ మూవ్‌లో టేక్ డౌన్‌తో స్కోరు 4-1గా మారింది. తర్వాత ఎడమ కాలి దాడిని పాయింట్లుగా మార్చుకుని హాన్‌ను మ్యాట్‌పైకి విసిరి 6-1 ఆధిక్యంలో నిలిచాడు. ఎడమ మోకాలి చికిత్స తర్వాత హాన్ పుంజుకునే ప్రయత్నం చేసినా అమన్ అడ్డుకున్నాడు. వరుసగా మూడు స్కోరింగ్ మూవ్‌లను సాధించి 7-6తో ఆధిక్యాన్ని కొనసాగించాడు. తర్వాత మరో రెండు టేక్ డౌన్‌లతో 10-7తో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. విమెన్స్ 53 కేజీ ఫైనల్లో ఆంటిమ్ 1-9తో మో మియుకా (జపాన్) చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సరిపెట్టుకుంది.
జపాన్ రెజ్లర్ ఆంటిమ్‌కు బలంగా దాడి చేసే చాన్స్ ఇవ్వలేదు. రెండో పీరియడ్‌లో ఆంటిమ్ కుడి కాలుతో దాడికి ప్రయత్నించగా, మియుకా వేగంగా స్పందించి 5-1 వద్ద నాలుగు పాయింట్లు నెగ్గింది. దాంతో స్కోరు 9-1గా మారింది. మెన్స్ 97 కేజీల్లో దీపక్ 2-1తో గంఖుయాంగ్ గన్బతార్ (మంగోలియా)పై గెలిచి కాంస్యం సాధించాడు.
