నల్లగొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం మూడు ప్రాణాలను బలితీసుకుంది. అర్ధరాత్రి వేళ ఇళ్లంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన సిలిండర్ పేలుడులో సజీవ దహనమయ్యారు.
మిర్యాలగూడ పట్టణంలోని కలల్‌వాడలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న ఒక కుటుంబం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీనివల్ల మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో అమ్మమ్మ చంద్రమ్మ (50), ఆమె మనవడు లక్ష్మణ్ (17), మనవరాలు ప్రణతి (14) అక్కడికక్కడే మృతి చెందారు. నిద్రలోనే మృత్యువు ముంచేయడంతో వారు ప్రాణాలు రక్షించుకునే లోపే అంతా జరిగిపోయింది.
పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. అనంతరం ఇళ్లలోకి వెళ్లి పరిశీలించగా.. పూర్తిగా కాలిపోయిన మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాద తీవ్రతను తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
