ముగ్గురు బీజేపీ ఎంపీల ఓటమి.. కాంగ్రెస్ ఎంపీలకు భారీ మెజార్టీ

ముగ్గురు బీజేపీ ఎంపీల ఓటమి.. కాంగ్రెస్ ఎంపీలకు భారీ మెజార్టీ
  •     కాంగ్రెస్ నుంచి రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపు 
  •     బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం
  •     బీజేపీ నుంచి సంజయ్, అర్వింద్, బాపురావుకు పరాజయం 

హైదరాబాద్, వెలుగు : ఈసారి ఏడుగురు ఎంపీలు అసెంబ్లీ బరిలో నిలిచారు. బీజేపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీఆర్‌‌ఎస్‌ నుంచి ఒక్కరు పోటీ చేశారు. అయితే మొత్తం ఏడుగురిలో నలుగురు మాత్రమే గెలిచారు. మరో ముగ్గురు ఓడిపోయారు.  ఓడిపోయిన ముగ్గురు కూడా బీజేపీ ఎంపీలే. మెదక్ ఎంపీ, బీఆర్‌‌ఎస్ లీడర్‌‌ కొత్త ప్రభాకర్‌‌రెడ్డి దుబ్బాక నుంచి పోటీకి దిగారు. ఆయన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఓడించారు. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు కొత్త ప్రభాకర్‌‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ సానుభూతి ప్రభాకర్‌‌రెడ్డికి కలిసి రావడంతో 53,513 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రఘునందన్‌రావుకు 44,366 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ (బీజేపీ) కోరుట్ల నుంచి పోటీ చేసి, రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఆయన బీఆర్‌‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ పై10,305 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు (బీజేపీ) బోథ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, బీఆర్‌‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌ చేతిలో 22,800 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌ (బీజేపీ) కరీంనగర్ నుంచి పోటీ చేసి, మంత్రి గంగుల కమాలకర్‌‌పై ఓడిపోయారు. 

కాంగ్రెస్ ఎంపీలకు భారీ మెజార్టీ.. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌‌నగర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ హుజూర్‌‌నగర్ నుంచి 44,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్‌‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు అదే కొడంగల్ నుంచి 32,532 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్‌‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌‌రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఇక భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (కాంగ్రెస్) నల్గొండ నుంచి అసెంబ్లీకి పోటీ పడ్డారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిని 54,332 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. కాగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఉత్తమ్, రేవంత్‌, కోమటిరెడ్డి, కొత్త ప్రభాకర్‌‌ తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఓడిపోయిన బండి సంజయ్‌, అర్వింద్‌, బాపురావు ఎంపీలుగా కొనసాగనున్నారు.