- తుపాకీ, 6 సెల్ ఫోన్లు, కారు సీజ్
- తమ పెంపుడు కుక్కలను కరిచినందుకే వెంటాడి కాల్పులు
పాలమూరు, వెలుగు: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలను చంపిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..గత నెల పొన్నకల్ గ్రామంలో మంద నరసింహారెడ్డి అత్త వారింట్లో ఉన్న డాచ్‌షండ్ పెంపుడు కుక్కలను వీధి కుక్కలు కరిచాయి. ఇందులో ఒకటి చనిపోగా, మరొకటి తీవ్రంగా గాయపడింది.
దీంతో నరసింహారెడ్డి వీధి కుక్కలపై కోపం పెంచుకొని, వాటిని చంపాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని తన ఫ్రెండ్స్ తారీక్ అహ్మద్, మహ్మద్ తాహిర్ కు చెప్పాడు. లైసెన్స్డ్ తుపాకీని తీసుకుని ముగ్గురు గత నెల15వ తేదీ రాత్రి టీఎస్11ఈఎఫ్7860 కారులో హైదరాబాద్ నుంచి పొన్నకల్ గ్రామం చేరుకున్నారు. రాత్రి ఒంటిగంట తర్వాత గన్ తీసుకుని కారులో బయలుదేరారు.
గ్రామంలో రోడ్డు వెంట కనిపించిన దాదాపు 20 వీధి కుక్కలను వెంబడించి కాల్చి చంపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. నరసింహారెడ్డి, తారీక్ అహ్మద్, మహ్మద్ తాహిర్ లను నిందితులుగా నిర్ధారించారు. నిందితులు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం పొన్నకల్ వచ్చినట్లు సమాచారం అందడంతో వారిని భూత్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నుంచి తుపాకీ, ఆరు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
