- 10 వేలకు పైగా విమానాలు రద్దు
- 21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ.. 20 కోట్ల మందిపై ప్రభావం
- పలు నగరాల్లో స్కూళ్లు బంద్
డల్లాస్: అమెరికాలో మంచు తుఫాన్ ‘ఫెర్న్’ బీభత్సం సృష్టిస్తున్నది. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మంచు, వర్షం కురుస్తున్నది. దీనికి తోడు బలమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. శుక్రవారం రాత్రి (లోకల్ టైమ్) నుంచే అమెరికాలో మంచు తుఫాన్ మొదలైంది. అది టెక్సస్, ఓక్లహోమా, అర్కాన్సాస్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ఆదివారం నాటికి మరిన్ని రాష్ట్రాలను తాకనుంది. ఇప్పటికే వాషింగ్టన్ డీసీ సహా 19 రాష్ట్రాల్లో అధికారులు ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 8 వేలకు పైగా విమానాలను రద్దు చేశారు. శనివారానికి సంబంధించి 3,400, ఆదివారానికి సంబంధించి 5 వేల ఫ్లైట్లను క్యాన్సిల్ చేశారు. ఎయిర్ ఇండియా కూడా న్యూయార్క్, నెవార్క్ వెళ్లే విమానాలను రద్దు చేసింది. ఓక్లహోమా, అర్కాన్సాస్ ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు ఒక అడుగు మేర మంచు కురిసింది. షికాగో వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత మైనస్ 40 డిగ్రీలకు చేరుకుంది. జార్జియా, అలబామా, టెన్నెసీ వంటి రాష్ట్రాల్లో చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో వేలాది ఇండ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కాగా, దేశంలో తీవ్రమైన మంచు తుఫాన్ కురిసే అవకాశం ఉందని అంతకుముందు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు రాష్ట్రాలకు విస్తరిస్తుందని తెలిపింది. న్యూ మెక్సికో నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు, ఈస్ట్ టెక్సస్ నుంచి నార్త్ కరోలినా వరకు విపరీతమైన మంచు కురుస్తుందని వెల్లడించింది. మంచు కారణంగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయని, పవర్ కట్ అవుతుందని చెప్పింది. దాదాపు 20 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని పేర్కొంది.
సర్కార్ సన్నద్ధం..
వాతావరణ శాఖ హెచ్చరికలతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. మంచు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. ‘‘30 సెర్చ్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. 7 లక్షలకు పైగా మీల్స్, 6 లక్షల బ్లాంకెట్స్, 300 జనరేటర్లు సిద్ధం చేశాం” అని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ఏయే రాష్ట్రాలను మంచు తుఫాన్ తాకుతూ వెళ్తుందో, ఆయా రాష్ట్రాల్లో వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ప్లాన్ సిద్ధం చేశామని తెలిపింది. ‘‘మంచు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. రాష్ట్రాలతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సమన్వయం చేసుకుంటున్నది” అని సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
సూపర్ మార్కెట్లు ఖాళీ..
వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని స్టేట్స్ స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. ఇల్లినాయీలోని షికాగో, టెక్సస్‌లోని డల్లాస్, ఫోర్ట్ వర్త్, పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా నగరాలతో సహా నార్త్, సౌత్ కరోలినా, మిషిగాన్, ఓహియో, మిసిసిప్పీ, వర్జీనియా, టెన్నెసీ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్కూళ్లను బంజేశారు. కొన్నిచోట్ల ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అలాగే కొన్ని యూనివర్సిటీల్లోనూ తరగతులను బంజేశారు. ఇక చర్చిల్లోనూ సండే సర్వీసులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ప్రజలు లేకుండానే ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో జనం సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు. వారానికి సరిపడా సరుకులను ముందే తెచ్చుకున్నారు. దీంతో చాలా వరకు సూపర్ మార్కెట్లలో స్టాక్ ఖాళీ అయింది.
