- ఈదురుగాలులకు కరెంట్ వైర్ తెగిపడి రైతు కన్నుమూత
ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒకే రోజు పిడుగులు పడి ముగ్గురు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో చోట ఈదురుగాలులకు కరెంట్వైరు తెగిపడడంతో ఓ రైతు చనిపోయాడు. కుమ్రం భీం ఆసిఫాబాద్జిల్లా వాంకిడి మండలం మన్నేగూడ ఖేడేగాం గ్రామానికి చెందిన గేడం మల్లు, గేడం టుల్లి, గేడం పద్మ శుక్రవారం వెల్గి శివారులో ఉన్న పత్తి చేనులో ఎరువులు (యూరియా ) వేయడానికి వెళ్లారు.
ఎరువులు వేస్తుండగా మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దీంతో పనులు బంద్ చేసి గేడం టుల్లి, గేడం పద్మ దంపతులు ఓ చెట్టు కింద, గేడం టుల్లి తమ్ముడు గేడం మల్లు మరో చెట్టు కింద నిలబడ్డాడు. భార్యాభర్తలపై పిడుగు పడడంతో గేడం పద్మ (30) అక్కడికక్కడే చనిపోయింది. గేడం టుల్లికి గాయాలు కావడంతో హస్పిటల్ తరలించారు. ఎస్ఐ సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త మృతి.. భార్యకు గాయాలు
జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గూడ గ్రామంలో పిడుగు పడి భర్త చనిపోగా, భార్య తీవ్రంగా గాయపడింది. పొలం పనుల కోసం వెళ్లిన భార్యాభర్తలు యాసీన్ ( 40) , హఫ్సానా వర్షం పడుతుండడంతో ఎద్దుల బండిపై ఇంటికి వస్తున్నారు. మార్గమధ్యలో వారిపై పిడుగు పడడంతో యాసీన్ అక్కడికక్కడే చనిపోయాడు. భార్య హఫ్సానా (38) తీవ్రంగా గాయపడింది. రెండు ఎడ్లు కూడా చనిపోయాయి. హఫ్సానాను 108లో రిమ్స్ కు తరలించారు.
మంగపేటలో యువరైతు
ములుగు జిల్లా మంగపేట మండలంలో మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పరిధిలోని బొమ్మాయిగూడానికి చెందిన యువ రైతు ఈసం పవన్ కళ్యాణ్ (24 ) గురువారం రాత్రి మొక్కజొన్న పంటకు కాపలాగా వెళ్లాడు. భారీ వర్షం రావడంతో ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో..
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర గ్రామానికి చెందిన యువరైతు కొమ్ము రాము(25) పొలంలో పత్తి పంటకు పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. ఈ సమయంలో ఈదురు గాలులు వీయడంతో పొలం మీదుగా ఉన్న విద్యుత్తీగల్లోంచి ఒక తీగ తెగి ఆయనపై పడింది. దీంతో కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు.