ముగ్గురి దోపిడి దొంగల ముఠా అరెస్టు

ముగ్గురి దోపిడి దొంగల ముఠా అరెస్టు

పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గాం మండల కేంద్రంలో గతంలో జరిగిన దోపిడి సంఘటనలో  ముగ్గురు నిందితులను  ఇవాళ (శనివారం) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆటో తో పాటు కత్తి ,బ్యాటరీ, లక్ష రూపాయల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అడిషనల్ డీసీపీ అశోక్ కుమార్.

2017 నవంబర్ 3న అంతర్గాం శివారులోని పంట చేనులో కొసవి విమల అనే మహిళ పని చేస్తుండగా..  గుమ్మాల వసంత కుమార్, పల్లి కొండ సురేష్, తోకల సిద్ధార్థ లు ఆమెపై దాడిచేశారు. చేతులు కట్టేసి, మెడలో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రామగుండం బి పవర్ హౌస్ రహదారి దగ్గర శనివారం పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఆటోలో అనుమానస్పదంగా ఉన్న ముగ్గురిని విచారించారు. ఆటోలో  కత్తి, బ్యాటరీ తదితర వస్తువులు లభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని విచారించగా గతంలో అంతర్గాంలో దోపిడీ చేయటంతో పాటు నస్ఫూర్  తదితర ప్రాంతాల్లో ముగ్గురు ముఠాగా ఏర్పడి దోపిడి చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.