ఏపీలో ఘోర ప్రమాదం... లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి..

ఏపీలో ఘోర ప్రమాదం... లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి..

ఏపీలోని విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా గాజువాకలో జరిగింది ఈ ప్రమాదం. ఆదివారం ( మే 31 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గాజువాకలోని శ్రీనగర్ కాలనీ దగ్గర ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మరో ఇద్దరు మహిళలు మృతి చెందగా..ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.