అగ్రనేతల్లారా..అజ్ఞాతం వీడండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు

అగ్రనేతల్లారా..అజ్ఞాతం వీడండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
  • లొంగిపోతే రక్షణ కల్పిస్తామని హామీ
  • డీజీపీ సమక్షంలో 37 మంది లొంగుబాటు.. అందులో ఆజాద్ సహా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు 
  • మొత్తం 25 మంది మహిళల్లో 14 మంది 22 ఏండ్లలోపు వాళ్లే

హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌‌ గణపతి, మల్లా రాజిరెడ్డి, తిప్పిరి తిరుపతి అలియాస్‌‌ దేవ్‌‌జీ సహా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారు కోరితే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

మావోయిస్టుల లొంగుబాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ధృక్పథంతో ఉందని, ఇదే విషయం ఇప్పటికే సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్‌‌ ఆజాద్‌‌, అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్, ముచ్చకి సోమడా అలియాస్‌‌ ఎర్ర సహా 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్‌‌రెడ్డి సమక్షంలో శనివారం లొంగిపోయారు.

తమతో ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో మీడియాతో ఇంటెలిజెన్స్‌‌ అడిషనల్‌‌ డీజీ విజయ్‌‌కుమార్‌‌, ఎస్‌‌ఐబీ చీఫ్‌‌, ఐజీ సుమతితో కలిసి డీజీపీ శివధర్‌‌రెడ్డి  మాట్లాడారు. లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీ మెంబర్లు‌‌ ఆజాద్‌‌, అప్పాసి నారాయణ, ముచ్చకి సోమడాలపై ఉన్న రివార్డులో ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున డీడీలను అందించారు. మిగతా వారికి హోదాను బట్టి రూ.లక్ష నుంచి రూ. 5 లక్షల రివార్డు మొత్తంలో తక్షణ సాయంగా కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డీడీలు అందించారు. ఇలా 37 మందికి మొత్తంగా రూ.కోటి 41 లక్షల 5వేల రూపాయలు అందజేశారు.

లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి.. 
మావోయిస్టులు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని డీజీపీ సూచించారు. ‘‘ఆపరేషన్ కగార్, అనారోగ్య కారణాలు, మారుతున్న పరిస్థితులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రక్షణ కల్పిస్తాం. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతలు,ఇతర మావోయిస్టులు బయటికి రండి.. జనజీవన స్రవంతిలో కలవండి. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీడియా మిత్రులు, మీకు తెలిసిన రాజకీయ నాయకులు లేక ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా.. ఏ మార్గం అన్నది మీ ఇష్టం. మీపై ఎలాంటి వేధింపులు లేకుండా చూస్తాం’’ అని హామీ ఇచ్చారు. పార్టీ పరంగా విబేధాలు, సిద్ధాంత పరంగా ఉన్న విబేధాలు, భద్రత దళాల నుంచి వస్తున్న ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతోనే మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు. 

లొంగిపోయినోళ్లు వీళ్లే.. 
కొయ్యడ సాంబయ్య అలియాస్‌‌ ఆజాద్‌‌ తెలంగాణ రాష్ట్ర కమిటీలో కొత్తగూడెం, అల్లూరి జిల్లా డివిజనల్‌‌ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. మరో రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్‌‌ రమేశ్‌‌తో పాటు ఖమ్మం డివిజనల్‌‌ కమిటీ సభ్యులు 9 మంది లొంగిపోయిన వారిలో ఉన్నారు. దండకారణ్యం స్పెషల్‌‌ జోనల్‌‌  రాష్ట్ర కమిటీ సభ్యుడు ముచ్చకి సోమడా అలియాస్‌‌ ఎర్రతో పాటు దక్షిణ బస్తర్‌‌ డివిజనల్‌‌ కమిటీ సభ్యులు లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు. 

37 మందిలో ఇద్దరు తెలంగాణ స్టేట్‌‌ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యుడు, 9 మంది కమిటీ సభ్యులు, సౌత్‌‌-బస్తర్‌‌ డివిజనల్‌‌ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒకరు, డివిజనల్‌‌ కమిటీ సభ్యులు ఇద్దరు, ఏరియా కమిటీ సభ్యులు ఏడుగురు, దళ సభ్యులు 13 మంది, పీఎల్‌‌జీఏ బెటాలియన్‌‌కు చెందిన డివిజనల్‌‌ కమిటీ సభ్యుడు ఒకరు, ఏరియా కమిటీ సభ్యుడు ఒకరు ఉన్నట్టు పేర్కొన్నారు.

14 మంది యువతులు.. 
లొంగిపోయిన మావోయిస్టుల్లో 25 మంది మహిళలు ఉన్నారు. చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరినోళ్లు ఉన్నారు. తెలంగాణ స్టేట్‌‌ కమిటీ టెక్నికల్ విభాగం సభ్యుడు సోడి హిడుమా(17) మైనర్ కాగా.. 22 ఏండ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్నోళ్లు 14 మంది యువతులు ఉన్నారు. వీరంతా చత్తీస్‌‌గఢ్‌‌కు చెందినవారే. స్థానిక పరిస్థితుల ప్రభావంతో మావోయిస్టు పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు.