విద్యా కమిషన్ రిపోర్ట్ను మూసీలో పడేయండి.. మురళిది అర్బన్ నక్సల్ భావజాలం: బండి సంజయ్

విద్యా కమిషన్ రిపోర్ట్ను మూసీలో పడేయండి.. మురళిది అర్బన్ నక్సల్ భావజాలం: బండి సంజయ్
  • టీచర్ల జీతాలు తగ్గించాలనడం సిగ్గుచేటు 
  • కూల్చివేతల్లో సీఎం రేవంత్​కు 
  • గిన్నిస్ రికార్డ్ ఖాయమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అర్బన్ నక్సలైట్ భావజాలమున్న ఆకునూరు మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్ వేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలోని కమిషన్ ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రభుత్వం ఏం సాధించిందని విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని, లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సహిస్తున్నారని, అర్బన్ నక్సలైట్ భావజాలమున్నవారిని కమిటీలు, కమిషన్లలో స్థానం కల్పిస్తున్నారని ఆరోపించారు. 


విద్యా కమిషన్​లో విద్యావేత్తలెక్కడున్నరు?

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, విద్యాశాఖకు దిక్కులేదని బండి సంజయ్​ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఫైర్​అయ్యారు. ‘‘విద్యా కమిషన్‌‌‌‌‌‌‌‌ లో అసలు విద్యావేత్తలు ఉన్నారా? కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఓ అర్బన్ నక్సలైట్. ఇలాంటివారి ఆధ్వర్యంలో కమిషన్ వేసి ప్రభుత్వం ఏం సాధిస్తుంది?

స్కూళ్లలో కనీసం చాక్‌‌‌‌‌‌‌‌ పీసులకు పైసల్లేవు.. స్కావెంజర్లు లేక అల్లాడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపకుండా.. టీచర్ల జీతాలు తగ్గించాలని సిఫారసు చేయడం సిగ్గుచేటు. ఎవరినీ సంప్రదించకుండా ఏసీ గదుల్లో కూర్చుని రాసిన నివేదిక అది. దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో వేయండి, లేకపోతే మూసీలో పడేయండి’’ అని మండిపడ్డారు. 

పాస్ మార్కులు పెంచితే పేదోళ్లు చదవద్దా?

పదో తరగతి పాస్ మార్కులను 35 నుంచి 45కు పెంచాలన్న కమిషన్ సిఫారసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివేదంతా పేద విద్యార్థులేనని, పాస్ మార్కులు పెంచితే వాళ్లు స్కూల్ స్థాయిలోనే చదువు మానేసే ప్రమాదం ఉందన్నారు.  

విద్యారంగానికి ఏండ్ల తరబడి సేవలందిస్తున్న టీచర్లకు సీనియారిటీ ఆధారంగా హెడ్మాస్టర్ గా ప్రమోషన్ ఇస్తున్నారని, కానీ కమిషన్ మాత్రం అందుకు భిన్నంగా నేరుగా హెడ్మాస్టర్ పోస్టుకు పరీక్షలు నిర్వహించాలని చెప్పడం విడ్డూరమని అన్నారు. టీచర్లను అవమానించేలా ఉన్న ఈ నివేదికను పక్కనపెట్టాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.

పేదల ఇండ్లు కూలుస్తుంటే రేవంత్ రెడ్డి ఆనందం పొందుతున్నరు

సీఎం రేవంత్ రెడ్డికి ఇండ్ల కూల్చివేతల్లో గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వొచ్చని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ‘‘పేదల ఇండ్లు కూలుస్తుంటే రేవంత్ రెడ్డి సైకోలా ఆనందం పొందుతున్నరు. ఒకప్పుడు ఇండ్లు ఎట్ల కూలుస్తరని ప్రశ్నించిన రేవంత్.. ఇప్పుడు తానే ఆ పని చేస్తున్నరు.

కోకాపేటలో వక్ఫ్ భూములు, మైనింగ్ భూముల జోలికి వెళ్లరు కానీ.. శారదా పీఠంలోని గుడులను మాత్రం కూలుస్తున్నారు. కాంగ్రెస్ తీరు మారకపోతే ప్రజలే ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తరు’’ అని అన్నారు. సంక్రాంతి పండుగ, మున్సిపల్ ఎన్నికల సాకుతో రైతు భరోసాను వాయిదా వేశారని సంజయ్ ఆరోపించారు.

ఇప్పటికే రెండు వాయిదాలు బాకీ ఉన్నారని, మూడోది వచ్చే సమయానికి పాతవి ఎగ్గొట్టే కుట్ర జరుగుతోందన్నారు. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోతే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.