40 వేలకు పైగా శాలరీ.. ఇదేం బలుపు.. అంత మందిని క్యూలో ఉంచి.. ఏం పని ఇది !

40 వేలకు పైగా శాలరీ.. ఇదేం బలుపు.. అంత మందిని క్యూలో ఉంచి.. ఏం పని ఇది !

రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక.. టికెట్ కౌంటర్లలో అయితే రద్దీ సమయంలో క్యూ లైన్లు కనిపిస్తుంటాయి. ఎంత ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ ఉన్నా అందరూ బుక్ చేసుకోలేరు. అలాంటి వారికి.. త్వరత్వరగా టికెట్ ఇచ్చేసి పంపించాల్సిన టికెట్ క్లర్క్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ప్రయాణికులు క్యూ లైన్లో నిల్చుని ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. సరే.. ఏదో అత్యవసర కాల్ అనుకుని ప్రయాణికులు కొంతసేపు సహనంతోనే వ్యవహరించారు. ఎంతసేపటికీ కాల్ పెట్టేయడం లేదు. 

అంతమందిని క్యూలో నిల్చోబెట్టి ఇతని మానాన ఇతను ఫోన్లో ముచ్చట్లు పెట్టాడు. చూసి.. చూసి.. ఓపిక నశించిన ఒక ప్రయాణికుడు.. ఇంకెంతసేపు లైన్లో ఉండాలని సదరు టికెట్ క్లర్క్ ను నిలదీశాడు. ఒక్క నిమిషం అని టికెట్ క్లర్క్ బదులిచ్చాడు. ఒక్క నిమిషం.. ఒక్క నిమిషం అని 15 నిమిషాల నుంచి చెబుతూనే ఉన్నావని.. అందుకోవాల్సిన రైలు వచ్చి వెళ్లిపోతే పరిస్థితి ఏంటని ప్రయాణికుడు మండిపడ్డాడు. క్యూ లైన్లో ఉన్న మిగిలిన ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు ఆ ఫోన్ పక్కన పెట్టి మళ్లీ పని మొదలుపెట్టాడు.

కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఈ టికెట్ క్లర్క్ నిర్వాకాన్ని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనిని ఉద్యోగం నుంచి తొలగించాలని వీడియో చూసిన నెటిజన్లు డిమాండ్ చేశారు. కర్ణాటక సోషల్ మీడియా పేజెస్ లో ఈ వీడియో వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. గుంతకల్ డీఆర్ఎంకు ట్యాగ్ చేసి సదరు టికెట్ క్లర్క్పై చర్యలు తీసుకోవాలని సూచించింది. రైల్వే టికెట్స్ ఇష్యూ చేసే కమర్షియల్ క్లర్క్ జీతం అలవెన్సులన్నీ కలిపితే సుమారు 40 వేల రూపాయల వరకూ ఉంటుంది.

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జీతభత్యాలు:
* బేసిక్ పే: 21 వేల 700 రూపాయలు
* డియర్నెస్ అలవెన్స్ (DA) (50%):10 వేల 850 రూపాయలు
* హౌస్ రెంట్ అలవెన్స్ (up to 27%): 5 వేల 859 (ఉండే సిటీ లేదా పట్టణాన్ని బట్టి)
* ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ (TA): 2 వేల160 రూపాయలు
* ఇతర అలవెన్స్లు: రూ.500 నుంచి రూ.1,000 (సుమారుగా)
* గ్రాస్ శాలరీ: 40 వేల నుంచి 42 వేల రూపాయలు
* వేతన తగ్గింపులు (Deductions) (PF, Taxes): 2 వేల నుంచి 2 వేల500 రూపాయలు